How to Remove Blood Stains on Clothes: బట్టలపై మరకలు పడటం కామన్. నూనె, కాఫీ, ఇంక్.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల మరకలు మన దుస్తులపై పడుతుంటాయి. ముఖ్యంగా రక్తం మరకలు ప్రతి మహిళ జీవితంలోనూ భాగమే. నెలసరి మొదలైనప్పటి నుంచి మెనోపాజ్ దశ వరకూ కనీసం ఒక్కసారైనా రక్తం మరకలు దుస్తులకు అంటనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఇలాంటప్పుడే కాదు.. కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు తెగడం, ఏదైనా పదునైన వస్తువు గుచ్చుకున్నప్పుడు, చిన్న చిన్న ప్రమాదాల సమయంలో రక్తం కారి దుస్తులకు మరకలు అవుతుంటాయి. అయితే చిన్న మరకే.. కదా అని ఎంతో ఇష్టపడిన డ్రస్సును పక్కన పడేయలేం. ఆ మరకలు కూడా అంత సులభంగా వదలవు. మరి, ఇలాంటి మొండి మరకల్ని తొలగించడానికి మార్గాలే లేవా? అంటే ఉన్నాయి.. కొన్ని ఈజీ టిప్స్‌తో రక్తం మరకలను ఇట్టే తొలగించవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చల్లటి నీరు:రక్తం మరకలు అంటగానే చాలా మంది వేడి నీళ్లలో ఆ దుస్తులను నానబెడుతుంటారు. ఇలా చేస్తే ఇతర మరకలు పోతాయేమో కానీ రక్తం మరకలు మాత్రం వేడి తగిలితే ఇంకాస్త గట్టిగా అతుక్కుంటాయట. అందుకే ఇలాంటి సందర్భాల్లో చల్లని నీటినే ఎక్కువగా ఉపయోగించాలి. దీనివల్ల మరక సులభంగా తొలగిపోతుంది.
ఉప్పు: చల్లటి నీటిలో ఉప్పు వేసి అందులో దుస్తులను నానబెట్టడం ద్వారా మరక సులభంగా వదిలిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మరక పడినచోట కొన్ని నీళ్లు పోసి ఆ తర్వాత రాళ్ల ఉప్పు తీసుకొని రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే మరక సులభంగా పోతుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్: రక్తం మరకలను తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ బెస్ట్. దీని కోసం ముందుగా కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని మరక పడినచోట పోయాలి. కాసేపు అలాగే ఉండనిచ్చి, ఉతికేస్తే సరిపోతుంది.
ఎంత ప్రయత్నించినా దుస్తులపై నూనె మరకలు పోవట్లేదా? - ఇలా చేశారంటే చిటికెలో మాయం!