How to Make Nuvvulu Barfi:చాలా మంది బర్ఫీలను ఇష్టంగా తింటుంటారు. వీటి కోసం ప్రత్యేకంగా షాపుకు వెళ్లి మరీ కొని తెచ్చుకుంటూ ఉంటారు. కారణం ఇవి సూపర్ టేస్టీగా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కాబట్టి. అయితే చాలా మందికి బర్ఫీలు అంటే జీడిపప్పుతో చేసినవి మాత్రమే తెలుసు. కానీ, అందరి ఇళ్లలో లభించే నువ్వులతో కూడా ఈ బర్ఫీలు తయారు చేసుకోవచ్చు. ఇవీ చాలా రుచిగా ఉంటాయి. అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతాయి. చాలా తక్కువ పదార్థాలతో తక్కువ టైమ్‌లో ఈ స్వీట్ ప్రిపేర్ చేయవచ్చు. నువ్వులు ఎలానూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా తినొచ్చు. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- తెల్ల నువ్వులు - ఒకటింపావు కప్పు
- బెల్లం తురుము - ముప్పావు కప్పు
- పాలపొడి - పావు కప్పు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
- ఉప్పు - చిటికెడు
- పల్లీలు - పావు కప్పు
- జీడిపప్పు - 10
- బాదం - 5
- నెయ్యి - తగినంత
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు పోసుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో పల్లీలు వేసి దోరగా వేయించుకుని మరో ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
- మిక్సీజార్‌లోకి చల్లార్చిన నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టాలి.
- అదే మిక్సీ జార్లో వేయించిన పల్లీలను పొట్టు లేకుండా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే రోట్లో దంచుకోవచ్చు.
- మరోసారి స్టవ్ ఆన్ చేసి నాన్‌స్టిక్ పాన్ పెట్టుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టి బెల్లం తరుము, మూడు స్పూన్ల వాటర్ పోసి కరిగించుకోవాలి.
- బెల్లం కరిగిన తర్వాత పాలపొడి వేసి ఉండలు లేకుండా కలిపి మిశ్రమం చిక్కబడేవరకు ఉడికించుకోవాలి.
- మూడు నిమిషాల తర్వాత యాలకుల పొడి, ఉప్పు, గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి వేసి కలిపి పాన్‌కు అంటుకోకుండా మధ్యమధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ముద్దగా మారే వరకు ఉడికించుకోవాలి.
- మిశ్రమం దగ్గరపడిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్ లేదా గిన్నెలోకి వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దంచుకున్న పల్లీలు, సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పలుకులు వేసి కొద్దిగా లైట్‌గా ఒత్తి కొద్దిసేపు పక్కన ఉంచాలి.
- గోరువెచ్చగా ఉన్నప్పుడు నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, మరెంతో ఆరోగ్యకరమైన నువ్వుల బర్ఫీ రెడీ.
- నచ్చితే మీరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇష్టంగా తింటారు.