తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఆరోగ్యానికి మేలు చేసే కొర్రలతో "మృదువైన ఇడ్లీలు"- ఈ కొలతలతో సింపుల్​గా చేసేయండిలా! - KORRA IDLI RECIPE

-హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ ట్రై చేయాలా ? -కొర్ర ఇడ్లీలు బెస్ట్​ ఆప్షన్​!

Korra Idli Recipe in Telugu
Korra Idli Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2024, 2:47 PM IST

Korra Idli Recipe in Telugu :చాలా మందికి వేడివేడి ఇడ్లీలు బ్రేక్​ఫాస్ట్​లో తినడమంటే ఎంతో ఇష్టం. ఉదయాన్నే ఇడ్లీలు తినడం వల్ల పొట్ట లైట్​గా ఉంటుందని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ఈ ఇడ్లీలనే ఇంకా ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చాలంటే.. అది కొర్రబియ్యంతోనే సాధ్యమవుతుంది. కొర్ర బియ్యాన్ని 'ఫాక్స్‌ టెయిల్‌' మిల్లెట్‌ అని అంటారు. చిన్నగా నలుసంత ఉండే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి.

కొర్రలలో ప్రొటీన్లు, క్యాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, ఐరన్, పీచు, విటమిన్‌ బి3, బి6, బి9, బి12 ఉన్నాయి. రోజూ కొర్రలతో చేసిన ఆహారం తింటే.. కండరాలు, ఎముకలు పటిష్టంగా ఉంటాయి. హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది. అయితే, ఇడ్లీలు ఎప్పుడూ ఇడ్లీరవ్వతో చేసినట్లు కాకుండా.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా కొర్రలతో చేయండి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి కొర్రల ఇడ్లీలను ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కొర్ర ఇడ్లీలు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • కొర్రలు - కప్పు
  • మినప్పప్పు - అరకప్పు
  • కాస్త ఉప్పు
  • అర చెంచా - మెంతులు

కొర్ర ఇడ్లీల తయారీ విధానం :

  • ముందుగా మినప్పప్పు శుభ్రంగా కడిగి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మినప్పప్పు మునిగేంత వరకు నీళ్లు పోయాలి.
  • అలాగే కొర్రలు శుభ్రంగా కడిగి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో సరిపడా వాటర్​ పోసి అలా వదిలేయాలి.
  • కొర్రలు, మినప్పప్పులను ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • అలాగే చిన్న గిన్నెలో మెంతులు అరగంటపాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం కొర్రలు, మినప్పప్పులోని నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి మినప్పప్పు, మెంతులు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోవాలి.
  • తర్వాత అదే మిక్సీ జార్​లోకి నానబెట్టిన కొర్రలు, కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మినపప్పు పేస్ట్​తో​కలుపుకోవాలి.(ఇక్కడ మీరు కొర్రలతో పాటు పావు గంట నీటిలో నానబెట్టిన.. పావు కప్పు అటుకులు కూడా వేసుకుని గ్రైండ్​ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కొర్ర ఇడ్లీలు మృదువుగా వస్తాయి.)
  • బౌల్​పై మూతపెట్టి పిండిని సుమారు పది గంటలు అలా వదిలేయాలి.
  • తర్వాత పిండిలో రుచికి సరిపడా ఉప్పు చూసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై ఇడ్లీ పాత్ర పెట్టి 2 గ్లాసుల నీటిని పోయండి.
  • నీరు వేడెక్కిన తర్వాత ఇడ్లీ ప్లేట్లలో కొర్ర పిండిని వేసుకుని పాత్రలో పెట్టండి.
  • ఈ కొర్ర ఇడ్లీలను స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించి స్టౌ ఆఫ్​ చేసుకోండి. తర్వాత ఓ 5 నిమిషాలు అలా వదిలేసి.. హాట్ బాక్స్​లోకి తీసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేస్తే వేడివేడి కొర్ర ఇడ్లీలు రెడీ!
  • ఈ ఇడ్లీలు రోటి పచ్చడి లేదా సాంబార్‌తో తింటే ఎంతో బాగుంటాయి.

ఇవి కూడా చదవండి :

జొన్నలతో రొట్టెలు, దోశలే కాదు - ఇలా "ఉప్మా"ను ప్రిపేర్ చేసుకోండి! - ఆరోగ్యానికి ఎంతో మేలు!

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ కోసం చూస్తున్నారా ? - ఇంట్లోనే "ఓట్స్ ఆమ్లెట్"​ చేసేసుకోండి - టేస్ట్​ సూపర్​!

ABOUT THE AUTHOR

...view details