How to Get Rid of Smell from Utensils:వంట చేసిన తర్వాత పాత్రల నుంచి వచ్చే వాసన ఓ పట్టాన పోదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. వాసన వస్తూనే ఉంటుంది. ఇక చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్‌వెజ్ వంటకాల గురించి చెప్పక్కర్లేదు. ఇవి వండినప్పుడు కేవలం వంట పాత్రల నుంచే కాదు కిచెన్ నుంచి కూడా నీచు వాసన వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల మసాలాలు వేసి వండినప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఈ సమస్య వంటింట్లో చిరాకు కలిగిస్తూ ఉంటుంది. ఈ వాసన పోగొట్టేందుకు కొద్దిమంది రసాయనాలు కలిగిన క్లీనర్స్ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల పాత్రలు పాడవడంతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాసనలు పోగొట్టేందుకు సహజమైన చిట్కాలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వైట్ వెనిగర్:వెనిగర్‌కు శుభ్రం చేసే గుణాలు మెండుగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వెనిగర్‌ను ఉపయోగించి వంట పాత్రల నుంచి వచ్చే వాసనను కూడా తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు ముందుగా పాత్రను శుభ్రంగా కడగాలి. అనంతరం ఆ పాత్రలో కొద్దిగా వెనిగర్ చల్లి.. కాసేపు వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే పాత్రల వాసన పోతుందని అంటున్నారు.
నిమ్మకాయ: నిమ్మకాయలోనూ యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి గిన్నెల నుంచి వచ్చే వాసనలను ఇది పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాసన వచ్చే పాత్రను పూర్తిగా నీటితో నింపి దాంట్లో నిమ్మరసం పిండి కొద్దిసేపు వదిలేయాలి. ఆ తర్వాత పాత్రను డిష్‌వాష్ లేదా నిమ్మచెక్కతో రుద్దితే వాసన పోతుందని అంటున్నారు.
కాఫీ పొడి: పాత్ర వాసనను పోగొట్టేందుకు కాఫీ పొడి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇందులోని నైట్రోజెన్ ఇందుకు సహకరిస్తుందని వివరిస్తున్నారు. ముందుగా పాత్రలో ఓ టేబుల్‌స్పూన్ కాఫీ పొడి వేయాలి. అనంతరం నీటితో నింపాలి. దాన్ని పొయ్యిపై పెట్టి ఓ రెండు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. అలాగే ఓ పావుగంట పక్కనపెట్టాలి. ఆ తర్వాత డిష్వాషర్తో పాత్రను క్లీన్ చేసుకోవాలి.
వంట సోడా: ఒకవేళ పాత్రల నుంచి మరీ విపరీతంగా వాసన వస్తుంటే వంట సోడా (బేకింగ్ సోడా) ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఓ పెద్ద పాత్రలో నీరు పోసి.. అందులో వాసన వచ్చే పాత్రను ముంచాలి. నీటిలో రెండు చిటికెళ్ల వంట సోడా వేసి కాసేపు నీటిని మరిగించాలి. ఆ తర్వాత పాత్రను నీటి నుంచి బయటికి తీసి శుభ్రం చేస్తే సరి.