Trudeau Counter To Trump : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కెనడా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో విలీనం కాదని తేల్చిచెప్పారు.
There isn’t a snowball’s chance in hell that Canada would become part of the United States.
— Justin Trudeau (@JustinTrudeau) January 7, 2025
Workers and communities in both our countries benefit from being each other’s biggest trading and security partner.
"కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదు. రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, రక్షణ భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారు."
- జస్టిన్ ట్రూడో ఎక్స్ పోస్ట్
మరోసారి ఆలోచించండి!
కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తాను చేసిన ‘51వ రాష్ట్రంగా విలీనం’ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా తన గత పదవీకాలం (2017-21)లోనూ కెనడాతో సత్సంబంధాలు లేని ట్రంప్, రెండోసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అంతేకాక, ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలంటించారు. ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోను వ్యంగ్యంగా సంబోధించారు. అంతేకాదు అమెరికాతో తనకున్న దక్షిణ సరిహద్దు మీదుగా మాదకద్రవ్యాల రవాణా, అక్రమ వలసలను కెనడా ఆపకపోతే సుంకం విధింపు తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇపుడు ట్రూడో రాజీనామా ప్రకటన వెలువడిన నేపథ్యంలో తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ మరోమారు స్పందించారు.
"కెనడాలో మెజారిటీ ప్రజలకు 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం కావడం ఇష్టమే. ఆ దేశంతో భారీ వాణిజ్యలోటును, ఇస్తున్న రాయితీలను అమెరికా ఇక ఎంతో కాలం భరించలేదని జస్టిన్ ట్రూడోకు తెలుసు. కాబట్టే రాజీనామా చేశారు. అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు, అధిక పన్నులు ఉండవు. నిరంతరం చుట్టుముట్టి ఉండే రష్యా, చైనా నౌకల ముప్పు నుంచి సురక్షితంగా ఉండవచ్చు" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
ట్రూడో రాజీనామా
లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ట్రూడో, తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలు మార్క్ కార్నీ, లీ బ్లాంక్‌లలో ఒకరు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రధాని రేసులో భారత సంతతి నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది.