Fresh Ginger Vs Dried Ginger Health Benefits :మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఆహార పదార్థాలు మన వంటింట్లోనే ఉంటాయి. అయితే, వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లం గురించి. సాధారణంగా మనం అల్లం వేయకుండా చేసే వంటలు చాలా తక్కువ. ప్రతి కర్రీలో అల్లం వేసేవారు కొందరైతే, టీ లో అల్లం వేసుకుని తాగేవారు మరికొందరు. ఇలా అల్లం ఉపయోగించడం వల్ల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందనే విషయం తెలుసు. అందుకే నిత్యం ఏదో ఒక విధంగా అల్లాన్ని మనం ఆహారంలో భాగం చేసుకుంటున్నాము. కేవలం పచ్చి అల్లం మాత్రమే కాకుండా ఎండిన అల్లాన్ని(శొంఠి) కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ రెండింటిలో(పచ్చి అల్లం, శొంఠి) ఏది ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.
అల్లం :మనకు మార్కెట్లో లభించే తాజా అల్లంలో (National Library of Medicine రిపోర్ట్)ఎన్నో రకాల ఔషధ గుణాలుంటాయి. ముఖ్యంగా అల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. అలాగే దీనిలో జింజెరాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అల్లంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, బి6 వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. అల్లం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా అధిక రక్తపోటుతో బాధపడేవారు అల్లం డైట్లో భాగం చేసుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. 2018లో 'జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కడుపు, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు అల్లం బాగా పనిచేస్తుందని తేలింది. ఈ పరిశోధనలో తైవాన్‌లోని చైనా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి చెందిన 'డాక్టర్ Hsin-Liang Lien' పాల్గొన్నారు.
శొంఠి :అల్లం పూర్తిగా ఎండిన తర్వాత.. మెత్తగా పొడి చేస్తారు. ఘాటుగా ఉండే దీనిని శొంఠిగా పిలుస్తుంటారు. ఉదయాన్నే వికారంగా ఉండేవారు శొంఠి పొడి, తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే సమస్య తగ్గుతుంది. అలాగే శొంఠి జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. రోజూ అన్నం తినే టైమ్‌లో రెండు ముద్దల్లో కాస్తంత శొంఠిపొడి, నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది. శొంఠి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే శరీరంలోని అనవసరమైన కొవ్వుని కరిగించి, బరువు తగ్గేలా చేస్తుంది. మజ్జిగలో శొంఠి పొడి కలిపి తాగితే.. ఆకలి పెరగడమే కాకుండా, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.