How to Make Restaurant Style Chole Bhature: చోలే భాతురే.. చాలా మందికి ఫేవరెట్ రెసిపీ. హోటల్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లిన చాలా మంది ఈ పంజాబ్ స్టైల్ చోలే భాతురేను ఆర్డర్ చేసుకుని ఇష్టంగా తింటారు. కాబూలి శనగలతో చేసే ఈ రెసిపీ టేస్ట్ అద్దిరిపోతుంది. మరి మీకు కూడా ఈ వంటకం తినాలని ఉందా? అయితే ఓ సారి ఇంట్లోనే ట్రై చేయండి. దీనిని చేయడం పెద్దగా కష్టమేమి కాదు. ఒక్కసారి తయారు చేస్తే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
భాతురే కోసం:
- బొంబాయి రవ్వ - ముప్పావు కప్పు
- పెరుగు - అర కప్పు
- ఉప్పు - అర చెంచా
- గోధుమ పిండి - 2 కప్పులు
చోలే కోసం:
- కాబూలి శనగలు - అర కేజీ
- దాల్చిన చెక్క - ఇంచ్
- నల్ల యాలక - 1
- యాలకులు - 3
- ఉప్పు - అర చెంచా
- ధనియాలు - 2 చెంచాలు
- మిరియాలు - 1 చెంచా
- జీలకర్ర - 1 చెంచా
- దాల్చిన చెక్క - ఇంచ్
- జాజికాయ - 1
- జాపత్రి - కొద్దిగా
- లవంగాలు - 6
- ఎండు మిర్చి - 7
- ఆయిల్ - 3 చెంచాలు
- జీలకర్ర - అర చెంచా
- బిర్యానీ ఆకులు - 2
- ఉల్లిపాయలు - 3
- అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 చెంచా
- టమాట - 2
- పసుపు - పావు చెంచా
- కారం - 1 చెంచా
- ఆమ్చూర్ పొడి - అర చెంచా
- నీళ్లు- మూడున్నర కప్పులు
- ఉప్పు
తయారీ విధానం:
- ముందుగా కాబూలి శనగలను శుభ్రంగా కడిగి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలనుకునేవారు వీటిని రాత్రి నానబెట్టుకోవడం మంచిది.
- భాతురే కోసం పిండి సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్లోకి బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలిపి ఓ రెండు నిమిషాలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత గోధుమ పిండి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలిపి మూతపెట్టి ఓ గంట సేపు పక్కన ఉంచాలి.
- ఇప్పుడు నానిన శనగలను కుక్కర్లో వేసి దాల్చిన చెక్క, నల్ల యాలక, ఉప్పు వేసి లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత జల్లెడలో పోసి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో దాల్చిన చెక్క, నల్ల యాలక, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
- మిక్సీ జార్‌లోకి వేయించిన ధనియాల మిశ్రమం, వేయించిన ఎండు మిర్చి మిశ్రమం వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, నల్ల యాలక వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు మగ్గించుకోవాలి.
- అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టమాట వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం వేసి బాగా కలిపి ఓ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి కలిపి ఉడికించిన శనగలు, ఉప్పు వేసి కలిపి ఆమ్ చూర్ పొడి, మూడున్నర కప్పుల నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఓ 5 నిమిషాలు ఉడికించుకుని పక్కన పెట్టాలి.
- ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కొద్దిగా వెల్లుల్లి, అల్లం తరుగు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కసూరీ మేథీ వేసి వేయించుకుని చోలేలో కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు గోధుమ పిండి మిశ్రమాన్ని మరోసారి కలిపి కొద్దిగా లావుగా ఉండలు చేసుకోవాలి.
- పొడి పిండి చల్లుకుంటూ మందంగానే పూరీలుగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుంటే రుచికరమైన చోలే భాతురే రెడీ.
- వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటే టేస్ట్ అదుర్స్. నచ్చితే మీరూ ట్రై చేయండి.
ఎప్పడూ ఒకేరకమైన పూరీ ఏం బాగుంటుంది? - ఈసారి బెంగాలీ స్టైల్ "రాధాభల్లబి పూరీలు" చేయండి - టేస్ట్ సూపర్!
సూపర్ టేస్టీగా ఉండే "హోటల్ స్టైల్ పూరీ కర్రీ" - ఇలా చేస్తే నిమిషాల్లో సిద్ధం!
10 నిమిషాల్లోనే కమ్మటి "వెజిటబుల్ మసాలా రైస్ " - పిల్లలకు ఇష్టమైన రెసిపీ