Chilli Onion Chutney Recipe :లంచ్‌లో ఎన్ని కూరలున్నా కూడా ఒక రెండు ముద్దలు పచ్చడితో తింటేనే మనసు తృప్తిగా ఉంటుందని అంటుంటారు చాలా మంది. అందుకే ఇంట్లోని మహిళలు సీజన్‌కి అనుగుణంగా ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరి పచ్చళ్లు ప్రిపేర్ చేసి పెడుతుంటారు. ఇవి ఉన్నా కూడా కొంత మంది దోశ, ఉప్మా, ఇడ్లీల్లోకి రకరకాల చట్నీలు తయారు చేస్తుంటారు. అయితే, ఈ స్టోరీలో మనం అన్నంలోకి, అలాగే ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సూపర్‌గా ఉండే ఒక చట్నీ ప్రిపేర్ చేద్దాం. అదే రుచికరమైన 'ఎండుమిర్చి ఉల్లిపాయ చట్నీ'. ఈ విధంగా చేసుకుంటే నిమిషాల్లోనే చట్నీ తయారైపోతుంది. మరి ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానం ఏంటో మీరు ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- కశ్మీరీ ఎండుమిర్చి -20
- ఉల్లిపాయలు - ఎనిమిది
- చింతపండు - నిమ్మకాయంత
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- సోంపు- టేబుల్‌స్పూన్
- జీలకర్ర - టేబుల్‌స్పూన్
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - ముప్పావు కప్పు
- సన్నగా తరిగిన అల్లం ముక్కలు - చెంచా
- నూనె - కప్పు
తాలింపు కోసం..
- ఆవాలు - 1 టీ స్పూన్
- మినప్పప్పు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- చిటికెడు - ఇంగువ
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 6
- కరివేపాకు - రెండు రెబ్బలు
తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి.
- తర్వాత ఎండుమిర్చి తొడిమెలు తీసి రెండు మూడు ముక్కలుగా కత్తిరించాలి. ఇప్పుడు వాటిలో గ్లాసు వేడినీళ్లు పోసి పక్కనుంచాలి.
- అలాగే చింతపండును ఒకసారి కడిగి, వేడినీళ్లతో నానబెట్టాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసిన పాన్ పెట్టండి. ఇందులో ధనియాలు, సోంపు, జీలకర్ర వేయండి. వీటిని సన్నని సెగ మీద వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు అదే మిక్సీ జార్లోఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి, నానిన ఎండుమిర్చి, అల్లం ముక్కలు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టడం కోసం.. స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో నూనె వేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేయాలి.
- తాలింపు గింజలు వేగాక.. దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ, గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమం వేసి బాగా కలపాలి.
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చట్నీ ఐదారు నిమిషాలు ఉడికించుకుని దింపేసుకోవాలి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎర్రెర్రగా నోరూరించే ఎండుమిర్చి ఉల్లి చట్నీ తయారైపోతుంది.
- నచ్చితే మీరు కూడా ఇలా ఓ సారి చట్నీ ట్రై చేయండి. టిఫెన్స్, అన్నం.. ఎందులోకి తిన్నా టేస్ట్ అద్దిరిపోతుంది.
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "ఆమ్లా బర్ఫీ" - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ - టేస్ట్ సూపరంతే!
కాకరకాయ చేదని తినట్లేదా? - ఈ కొలతలతో పచ్చడి చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!