Two MNREGA Workers Dead In Siddipet : ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై బండరాళ్లు, మట్టి పెళ్లలు పడటంతో తల్లీ కుమార్తెలు మృతి చెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఉపాధి కూలీలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : గోవర్ధనగిరిలోని సంజీవరాయని గుట్ట వద్ద 45 రోజులుగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉపాధి కూలీలు గుట్ట కింద మట్టి తవ్వి పొలం బాటలు నిర్మించేందుకు తరలిస్తున్నారు. ఈ పనులకు గురువారం 21 మంది కూలీలు హాజరయ్యారు. కొందరు గడ్డ పారలతో మట్టిని తవ్వుతుండగా, పైనుంచి బండరాళ్లు, మట్టి పెళ్లలు ఒక్కసారిగా కిందికి జారిపడ్డాయి. దాంతో పలువురు వాటి కింద చిక్కుకుపోయారు.
తల్లీకుమార్తె మృతి, మరో ఐదుగురికి గాయాలు : అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై జేసీబీతో బండరాళ్లను తొలగించి, వాటి కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అప్పటికే తల్లీకుమార్తెలు కందారపు సారవ్వ(50), అన్నాజి మమత(32) ప్రాణాలు కోల్పోయారు. ఇంద్రాల స్వరూప, ఇంద్రాల రేణుక, వలబోజు మణెమ్మ, గౌడ వెంకటయ్య, తాటికొండ విమలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అనంతరం స్వరూపను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.