Osmania General Hospital : ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోషామహల్ మైదానంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ కొత్త ఆసుపత్రి భవనం 2 వేల పడకలతో 26.30 ఎకరాల్లో నిర్మించనున్నారు. రూ.2,400 కోట్లతో 14 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించనున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. కొత్త ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు కల్పించనున్నారు. నూతన ఆసుపత్రి రావడంతో 20 శాతం వైద్యుల సంఖ్య పెరగనుంది. రోజూ దాదాపు 5 వేల మందికి ఓపీ సేవలందించేలా అభివృద్ధి చేయనున్నారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణం కానుంది.
నిత్యం వేల సంఖ్యలో ఓపీ (OP), వందలాది మంది ఇన్ పేషెంట్‌లు. వెరసి ఎప్పుడు చూసినా కిక్కిరిసి కనిపిస్తుంది ఉస్మానియా ఆసుపత్రి. మొత్తం 22 విభాగాలు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు ఇలా ఎన్నో ఆధునిక వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రికి జబ్బు చేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. రోగులకు సరిపడా బెడ్స్, ఆపరేషన్ థియేటర్స్ లేమితో పాటు ఎప్పుడూ ఏదో సమస్యతో ఆసుపత్రి కునారిల్లుతున్నా పాలకులకు పెద్దగా పట్టింది లేదు. దానికి తోడు దాదాపు దశాబ్దాల కిందటి పాత భవనం తరచూ పెచ్చులూడటంతో దాన్ని మూసి వేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఆసుపత్రి ఉన్న భవనంలో బెడ్స్ లేక ఇబ్బంది పడాల్సిన దుస్థితి. బీఆర్‌ఎస్ సర్కారు కొత్త భవనం నిర్మిస్తామని చెప్పినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సర్కారు ఉస్మానియా భవన నిర్మాణానికి నడుం బిగించింది. గోషామహల్ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.
ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర : 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా ఆసుపత్రిని కట్టించారు. మొత్తం 22 విభాగాల్లో ఇక్కడ వైద్య సేవలు అందిస్తుండగా, 1096 పడకలు అందుబాటులో ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్, స్కిన్ బ్యాంక్, డయాబెటిక్ ఫూట్ కేర్ క్లినిక్, ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌తో పాటు కాలిన గాయాలు అయిన వారికి మెరుగైన చికిత్స అందించడంలో ఉస్మానియా పెట్టింది పేరు. నిత్యం 2 వేల మందికి పైగా ఓపీ సేవలు పొందుతుండగా, బెడ్స్ కొరత అతిపెద్ద సమస్య. ఈ నేపథ్యంలో కొత్త భవనాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రంగా తీర్చిదిద్దాలని సర్కారు భావిస్తోంది.
కొత్త ఆసుపత్రి నిర్మాణం ఇలా : గోషామహల్‌లో దాదాపు 3 ఎకరాల్లో 14 అంతస్తులతో కొత్త భవంతిని నిర్మించ తలపెట్టింది సర్కార్. రూ.2,075 కోట్లతో కట్టబోయే కొత్త భవంతిలో 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉస్మానియాలో ఉన్న 22 విభాగాలకు మరో 8 విభాగాలు చేర్చనున్నట్లు స్పష్టం చేసింది. ఆసుపత్రికి వచ్చే రోగులు, సిబ్బంది కోసం సెల్లార్ 2 ఫ్లోర్‌లలో పార్కింగ్ ఏర్పాటు చేయనుంది. రోజూ 3 నుంచి 5 వేల మందికి సేవలు అందించేందుకు వీలుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓపీ కౌంటర్‌లు, అన్ని విభాగాల వైద్య పరీక్షలకు అవసరమైన ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
అత్యాధునిక హంగులు : ఆసుపత్రి గదులలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్‌లు, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్‌లు అందుబాటులోకి తేనుంది. అవయవ మార్పిడి కోసం అత్యాధునిక థియేటర్‌లు సిద్ధం చేయనున్నట్టు పేర్కొంది. 2026-27 నాటికి ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్న సర్కారు, వచ్చే వందేళ్ల కాలానికి సేవలు అందించేందుకు వీలుగా ఆధునిక హంగులను నిర్మించనున్నట్లు వెల్లడిస్తోంది. విశాలమైన రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం హెలిపాడ్స్, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ల నిర్వహణ కోసం సెమినార్ హాల్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
నెలాఖరులో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన : సీఎం రేవంత్ రెడ్డి