H 1B Visas Registration Start Date : భారత ఐటీ నిపుణులకు అత్యంత కీలకమైన అమెరికా హెచ్-1బీ వీసాల ఇనీషియల్ రిజిస్ట్రేషన్ తేదీలపై ప్రకటన వెలువడింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై, మార్చి 24తో ముగియనుంది. ఈ మేరకు అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది. మార్చి 7 నుంచి 24లోగా యూఎస్‌సీఐఎస్ అధికారిక ఆన్‌లైన్ ఖాతా ద్వారా అర్హతలు కలిగిన కంపెనీలు ఇనీషియల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
హెచ్-1బీ వీసాల ఇనీషియల్ రిజిస్ట్రేషన్ ఎవరెవరికి అవసరమో వారందరి సమాచారాన్ని డిజిటల్‌గా నమోదు చేయాలని యూఎస్‌సీఐఎస్ నిర్దేశించింది. ఈ క్రమంలో కంపెనీలన్నీ ప్రతీ లబ్ధిదారుడి తరఫున రూ.18,801 (215 అమెరికా డాలర్లు) చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలని కోరింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన లబ్ధిదారుడి కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ ప్రాతిపదికన 2026 ఆర్థిక సంవత్సరంలోనూ హెచ్-1బీ వీసాలపై పరిమితిని అమలు చేస్తామని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
మార్చి 24 తర్వాత దరఖాస్తులను స్క్రూటినీ చేసి, అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి చెందిన యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాలకు సమాచారాన్ని పంపిస్తారు. అమెరికాలో ఆర్థిక సంవత్సరం ఏటా అక్టోబరు 1న ప్రారంభమవుతుంది. ఈ లెక్కన అమెరికాలో 2026 ఆర్థిక సంవత్సరం అనేది ఈ ఏడాది అక్టోబరు 1న మొదలవుతుంది. ఇప్పుడు దీని కోసమే హెచ్-1బీ వీసాల ఇనీషియల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టారు.
హెచ్-1బీ అనేవి నాన్- ఇమిగ్రెంట్ రకానికి చెందిన వీసాలు. సాంకేతిక నిపుణులు, సాంకేతిక అంశాల్లో నిష్ణాతులుగా ఉన్న వారికి ఈ వీసాలను అమెరికా జారీ చేస్తుంటుంది. వీటి ద్వారా ప్రపంచంలో అత్యధికంగా లబ్ధిపొందేది భారతీయులు, చైనీయులే. అమెరికాలోని టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాలతోనే భారత్, చైనాకు చెందిన వేలాది మంది టెక్ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. ఏటా అమెరికా 6.50 లక్షల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీయులకు ప్రతి సంవత్సరం 20వేల వీసాలను జారీ చేస్తుంది.
72 శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులకే : కేంద్రం
2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు మధ్యకాలంలో అమెరికా నుంచి హెచ్-1బీ వీసాలు అందుకున్న వారిలో 72.3 శాతం మంది భారతీయులే. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) విభాగం వెల్లడించింది. ఇటీవలే రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆ విషయాన్ని తెలియజేశారు.