Phone Tapping case Update : ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో హైకోర్టులో పని చేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నాయని తేలింది. నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని ఓ కీలక జడ్జి సహా ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారమూ అందులో ఉంది. మరోవైపు ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ప్రొక్లెయిమ్‌డ్ అఫెండర్ అస్త్రాన్ని ప్రయోగించేలా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులో రోజుకో విస్మయకర అంశం వెలుగులోకి వస్తోంది. ఇటీవలే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయిన అంశం వెల్లడి కాగా, తాజాగా మరిన్ని అంశాలు విస్తుగొలుపుతున్నాయి. హైకోర్టులో పని చేస్తున్న 18 మంది న్యాయమూర్తుల పుట్టుపూర్వోత్తరాలు సహా పూర్తి ప్రొఫైల్ ఓ నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నట్లు తేలింది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్‌పై ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందంపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి ఫోన్‌లను, అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ -ఎఫ్ఎస్ఎల్కు పంపారు. మూడో నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌కు సంబంధించి పోలీసులకు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి : భుజంగరావు కంప్యూటర్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైళ్లు ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో తేలింది. ఈ మధ్య పదవీ విరమణ చేసిన ముగ్గురి ప్రొఫైళ్లు సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తి, ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో ముగ్గురి సమాచారం సైతం ఉంది. హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఈ ప్రొఫైళ్లలో వారి ఫొటోలు, పుట్టుపూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబసభ్యుల అన్ని వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వారిద్దరినీ భారత్‌కు రప్పించేందుకు : మరోవైపు ట్యాపింగ్ కేసు నమోదు కాగానే విదేశాలకు పరారైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను భారత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేలా పోలీసుల ప్రక్రియను అడ్డుకునేందుకు నిందితులు శతథా ప్రయత్నిస్తున్నారు. పాస్‌పోర్టులు సైతం రద్దు చేయొద్దంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఇప్పటికే దరఖాస్తులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిందితులను ప్రకటిత నేరస్థులుగా నిర్ధారించేలా పోలీసులు కసరత్తు ప్రారంభించారు. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్‌గా న్యాయస్థానం గుర్తిస్తే వారిని సాధారణ పౌరులెవరైనా సరే పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించొచ్చు. బీఎన్ఎస్ సెక్షన్ 85 కింద నిందితుల స్థిర, చరాస్తులన్నీ జప్తు చేసే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కదులుతున్న డొంక - మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ - త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్!