Real Estate Traders Encroached On Temple Land In Nizamabad : రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆలయ భూమిని ఆక్రమించి వెంచర్ వేశారు. ఈ ఉదంతం నిజామాబాద్ నగర శివారులో వెలుగుచూసింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఈ ఖరీదైన రెండు ఎకరాల భూమిని ఆక్రమించారు. సదరు వ్యక్తులు వేసిన వెంచరుకు రహదారి నిర్మాణం కోసం 6 గుంటల స్థలాన్ని కలిపేసుకున్నారు. మరో 1.09 ఎకరం విస్తీర్ణాన్ని పార్కుగా పేర్కొంటూ చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
ఇంకో 10 గుంటల స్థలాన్ని ఓపెన్ ప్లాట్లుగా మార్చారు. మరో 15 గుంటలను చదును చేసుకొని తమదిగా చెప్పుకొంటున్నారు. ఇదీ మాణిక్ బండార్ శివారులో భూ ఆక్రమణ బాగోతం. ఈ వ్యవహారంపై వచ్చిన కంప్లైంట్‌పై రెవెన్యూ యంత్రాంగం విచారణ చేపట్టారు. రెవెన్యూ యంత్రాంగం చేసిన సర్వేలో ఈ మేరకు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అనుమతి పత్రాలతో హాజరు అవ్వాలి : గుడి భూముల ఆక్రమణ విషయంలో పాలన అధికారికి ఇటీవల కంప్లైంట్ అందింది. ఆయన విచారణకు ఆదేశించటం క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేలో ఆలయాలకు చెందిన రెండు ఎకరాల భూమి తగ్గిపోవటం గమనించారు. తగ్గిన ఆలయాల భూమి వెంచరు అభివృద్ధిలో భాగంగా రహదారి, పార్కుకు కేటాయించిన స్థలంగా స్థానికంగా చూపటాన్ని గుర్తించారు.
ఈ క్రమంలోనే సదరు వెంచరు అనుమతుల వివరాలను సమర్పించాలని మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగానికి ఆర్డీవో 2 వారాల కిందట లేఖ రాశారు. కానీ అనుమతిని ఇచ్చింది తాము కాదని, జిల్లా లేఅవుట్ అనుమతుల కమిటీ ఇచ్చిందని వారు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనుమతి పత్రాలతో హాజరు అవ్వాలని యజమానులకు నోటీసు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.
ఆలయ భూమిని కొంత కలుపుకొన్నారు : మాణిక్ బండార్ శివారులోని చిన్న ఆలయాలకు పూర్వం ఇనాం కింద కేటాయించిన భూములు ఉన్నాయి. రెవెన్యూ రికార్డులైన సేతువార్, పహనీల ఆధారంగా 474, 480, 499, 503, 548 సర్వే నెంబర్లలో ఆలయాలకు ఇనాంగా ఇచ్చిన 3.37 ఎకరాల భూమి ఉంది. మరో 13 గుంటల ఖారీజ్ ఖాతాగా ఉన్నయని అధికారులు అంటున్నారు. కాగా నాలుగు సంవత్సరాల కిందట ఈ భూమికి సమీపంలోని భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు.
భారీ విస్తీర్ణంతో వెంచరును అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వెంచరుకు రహదారి నిర్మాణం చేపట్టే టైంలో పక్కనే ఉన్న ఆలయ భూమిని కొంత కలుపుకొన్నారు. అంతటితో ఆగలేదు. ఇంకొంత భాగాన్ని ప్లాట్లు, పార్కుగా కూడా మార్చడం చేశారు.