New Ration Card Applications : రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుదారులతో మీ సేవ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా మంగళవారం ఉదయం నుంచి మీ-సేవ కేంద్రాలకు దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. తాజాగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మీ-సేవ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం, ఆధార్‌కార్డు అప్డేట్ కోసం క జనాలు భారీగా తరలివస్తున్నారు. ఒకేసారి రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని మీ-సేవ నిర్వాహకులు వాపోతున్నారు. అలాగే దరఖాస్తులు చేసుకునేందుకు గంటల కొద్దీ సమయం పడుతుందని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీసేవ కేంద్రం వద్ద జనం బారులు : ఇవాళ ఉదయం 6 గంటల నుంచే హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ మీ-సేవ కేంద్రం, మలక్‌పేట పౌరసరఫరాల శాఖ కార్యాలయం ముందు కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుదారులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మీ సేవలో సరిపడా స్టాఫ్ లేకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమం, కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ఇప్పుడు అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
రేషన్‌కార్డుల దరఖాస్తుల్లో గందరగోళం : మరోవైపు రేషన్‌కార్డులకు దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది. రేషన్‌కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును సివిల్ సప్లై ఆఫీసులో ఇవ్వాలని మీసేవ నిర్వాహకులు చెపుతున్నారు. దీంతో ప్రజలు రసీదులు తీసుకుని సివిల్ సప్లై కార్యాలయానికి వెళ్తున్నారు. రెండుచోట్ల గంటల కొద్దీ వేచిఉండాల్సి వస్తోందని.. మీ సేవలో దరఖాస్తు చేశాక మళ్లీ రసీదు ఎందుకు ఇవ్వాలని అధికారులపైన మండిపడుతున్నారు.
గర్భిణీ స్త్రీలు సైతం క్యూలైన్లో : సికింద్రాబాద్‌లో రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ప్రజలు మీ సేవ కేంద్రానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచి ప్రజలు మీసేవ వద్ద ప్రజలు బారులు తీరారు. గర్భిణీ స్త్రీలు సైతం క్యూలైన్లో గంటలు తరబడి నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దరఖాస్తుల నిమిత్తం మరిన్ని సెంటర్లు కేటాయించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ : రేషన్‌కార్డు అర్హుల జాబితాలో పేర్లు రానివారు ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా నూతన రేషన్‌కార్డుల కోసం జనాలు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 17,088, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 38,879 దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులు ఎవరనేది తేల్చనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిరీక్షణకు తెరపడేనా : రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల కోసం లక్షలాది ప్రజలు నిరీక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నూతన రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలో వేగం అందుకుంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని పేదల్లో ఆశలు చిగురించాయి. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను అధికారులకు అందించారు. వీటి ఆధారంగా అర్హుల జాబితాను అధికారులు రూపొందించి గ్రామసభల్లో ప్రవేశపెట్టారు. గ్రామసభల ఆమోదంతో లబ్ధిదారుల వివరాలు సేకరించి తుది జాబితా తయారుచేశారు. ప్రభుత్వం ఆదేశాలిస్తే రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ కొంత ఆలస్యం కావొచ్చునని సమాచారం.
'మీసేవ'లో రేషన్‌కార్డు దరఖాస్తులు - కీలక ప్రకటన చేసిన పౌరసరఫరాల శాఖ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో కొర్రీలు! - మీకు ఇవి ఉంటే దరఖాస్తు తిరస్కరణ!