Washington Plane Collision Trump : విమాన ప్రమాదంపై శ్వేతసౌధంలో మీడియా సమావేశం నిర్వహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు బైడెన్ పాలనపై విమర్శలు గుప్పించారు. భద్రతా ప్రమాణాల విషయంలో బైడెన్ రాజీపడ్డారని ఆరోపించారు. మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో నియంమించిందని ఆరోపించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో జరిగిన సంభాషణల టేపులను విన్నానని తెలిపిన ట్రంప్ ప్రమాదంలో పైలట్ తప్పిదం లేదని చెప్పారు. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ ఎగరడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో ఎవరైనా తప్పిదానికి పాల్పడ్డారనే విషయం తనకు తెలియదన్నారు.
'67మంది దుర్మరణం'
అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో పౌర విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది మృతిచెందారు. విమానంలో ఉన్న 64 మంది ప్రయాణికులు, హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సైనికులు చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది మృతదేహాలను పోటోమాక్ నది నుంచి వెలికితీశామని వెల్లడించారు. రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా హెలికాప్టర్ ఢీకొట్టిందని చెప్పారు.