What Seeds that are Beneficial to Health:మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు కొన్ని రకాల గింజలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఆరోగ్యంగా ఉండడానికి ఏ గింజలు తీసుకోవాలి ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ ? అనే విషయాలను ప్రముఖ డైటీషియన్ 'డాక్టర్ శ్రీలత' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..!
చియా సీడ్స్ :సీడ్స్‌లో మన శరీరానికి అత్యంత అవసరమైన పీచు పదార్థం అధికంగా ఉంటుంది. చియా గింజలలో కూడా పీచు ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, నాణ్యమైన ప్రొటీన్, అనేక రకాల ఖనిజాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సుమారు 2 టేబుల్ స్పూన్ల చియా గింజల ద్వారా 10 గ్రాముల పీచుని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనాలను పండ్ల రసాలలో లేదా బాదం పాలలో నానబెడితే మృదువుగా మారతాయి. ఆ తర్వాత వాటిని తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు.
గుమ్మడి గింజలు :ఈ గింజలలో మన హెల్త్‌కు మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. ముఖ్యంగా ఇందులో గుండె ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలకు మేలు చేస్తుంది. గుమ్మడి గింజలను సూప్‌లు, సలాడ్లలో కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
దానిమ్మ గింజలు :మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి దానిమ్మ గింజల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇంకా మన కణాలకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకోవడం మంచిదన చెబుతున్నారు.
క్వినోవా :మన ఆరోగ్యానికి మేలు చేసే గింజల్లో క్వినోవా కూడా ఒకటి. ధాన్యంలా కనిపించే వీటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. సుమారు కప్పు క్వినోవా తీసుకోవడం ద్వారా 8 గ్రాముల ప్రొటీన్ పొందవచ్చు. వీటిని అన్నంలాగానే వండాలి. ఉదయాన్నే క్వినోవా తినడం వల్ల పీచు పదార్థం, ప్రొటీన్, ఇనుము పొందవచ్చని చెబుతున్నారు
అవిసె గింజలు :వీటిలో పీచు పదార్థం, ప్రొటీన్లు, ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. రక్తపోటుతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. దాదాపు 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల్లో 7 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని వివరిస్తున్నారు.