తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

టమాటా, వెల్లుల్లి, బ్రెడ్ ఫ్రిజ్​లో పెడుతున్నారా? వేటిని ఇందులో పెట్టకూడదో తెలుసా? - THINGS SHOULD NOT KEEP IN FRIDGE

-కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్​లో పెట్టోదట! -రుచితో పాటు త్వరగా పాడవుతాయని వెల్లడి

THINGS SHOULD NOT KEEP IN FRIDGE
THINGS SHOULD NOT KEEP IN FRIDGE (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Jan 30, 2025, 12:36 PM IST

Things Should Not Keep in Fridge:ప్రస్తుత ఆధునిక సమాజంలో దాదాపు అందరి ఇళ్లలో ఫ్రిజ్ సాధారణంగా మారిపోయింది. మార్కెట్లో తెచ్చిన కూరగాయలు, పండ్లు అన్నింటినీ ఫ్రిజ్​లో పెట్టేస్తుంటారు. ముఖ్యంగా తీరిక లేని జీవనశైలి కారణంగా చాలా మంది రకరకాల ఆహార పదార్థాలను ఇలానే ఒకేసారి పెద్దమొత్తంలో తెచ్చిపెట్టుకుంటుటారు. కానీ, కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్​లో అసలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె: ఇందులో నీటి శాతం తక్కువగా ఆమ్లతత్వం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీనికి బ్యాక్టీరియాను నిరోధించే గుణం ఉంది కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఒకవేళ ఫ్రిజ్​లో పెడితే తేనె గట్టిగా మారిపోయి వాడుకోవడానికి అనువుగా ఉండదని వివరిస్తున్నారు.

బ్రెడ్‌: ఫ్రిజ్‌లో బ్రెడ్ పెడితే ఎండిపోయినట్లుగా అవుతుందని.. కాస్త తేమ తగిలితే బూజూ పడుతుందని అంటున్నారు. అలాకాకుండా ఉండేందుకు పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని సూచిస్తున్నారు. లేదంటే ఇప్పుడు వస్తున్న బ్రెడ్‌ స్టోరేజ్‌ బ్యాగుల్లో పెట్టినా సరిపోతుందని చెబుతున్నారు.

ఫ్రిజ్​లో పెట్టకూడని పదార్థాలు (Getty Images)

టమాటాలు: వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి లోపల సూక్ష్మంగా ఉండే ఓ పోషకాహార పొర పోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలా కాకుండా గాలి పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే సహజంగా ముగ్గి వండేటప్పుడు వాటి రుచి పెరుగుతుందని అంటున్నారు.

అరటిపండ్లు: వీటిని ఫ్రిజ్‌లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే తొక్క రంగు మారిపోవడమే కాకుండా.. పండ్లూ రుచిని కోల్పోతాయని అంటున్నారు. ఒక్కోసారి తినడానికి పనికిరాకుండా పోతాయని వివరిస్తున్నారు. అందుకే ఫ్రిజ్​కు బదులుగా బ్రౌన్‌పేపర్‌లో చుట్టి పెడితే సరిపోతుందని సూచిస్తున్నారు.

ఫ్రిజ్​లో పెట్టకూడని పదార్థాలు (Getty Images)

కాఫీ: కాఫీగింజలు, పొడి ఏదైనా సరే ఫ్రిజ్‌లో పెడితే వాటి ఫ్లేవర్‌ పోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్ చల్లదనానికి ఇందులోని నేచురల్‌ ఆయిల్స్‌ బలహీనపడి రుచీ, వాసన తగ్గిపోతాయని అంటున్నారు.

బంగాళాదుంపలు: వీటిని ఫ్రిజ్‌లో పెడితే ఇందులోని స్టార్చ్‌ చక్కెరగా మారుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో వీటిని వేయించినప్పుడు ఆ చక్కెరలు ప్రమాదకర రసాయనాలుగా మారతాయని హెచ్చరిస్తున్నారు. 2017లో Journal of Food Scienceలో ప్రచురితమైన "Storage Conditions for Potatoes" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.

ఫ్రిజ్​లో పెట్టకూడని పదార్థాలు (Getty Images)

ఉల్లి- వెల్లుల్లి:వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే ఈ రెండింటి వాసన, రుచీ ఇతర పదార్థాలకు అంటుతుందని చెబుతున్నారు. ఇంకా తేమగా ఉంటే కుళ్లిపోయే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే అలాకాకుండా గాలి ధారాళంగా వచ్చే చీకటి ప్రదేశంలో ఉంచితే ఎక్కువ రోజులు మొలకెత్తకుండా ఉంటాయని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గోడలపై గీతలు, ఫర్నీచర్​పై మరకలు మొత్తం పోతాయ్​! హోమ్ క్లీనింగ్​కు సూపర్ టిప్స్!!

అతి ప్రేమతో కొత్త సమస్య - అలా ఊహించుకుంటే ప్రమాదమే!

ABOUT THE AUTHOR

...view details