Tips for Sleeping Well at Night: మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఎంతో అవసరం ఉంటుంది. సరిగా నిద్రపోకపోతే చిరాకు, అలసట, విచారంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శారీరక స్పందనల వేగం తగ్గి.. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తాయని.. సరైన కారణాన్ని గుర్తిస్తే సరిదిద్దుకోవచ్చని చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పగటి నిద్ర: మనలో చాలా మంది పగటి పూట ఏదో కాసేపు కునుకు తీస్తే ఇబ్బందేమీ ఉండదని పడుకుంటారు. కానీ పగలు ఎక్కువసేపు పడుకుంటే రాత్రి పూట నిద్ర అవసరం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా శరీరంలో జీవ గడియారమూ గతి తప్పి.. పగటి పూట చురుకుగా, రాత్రి పూట నిద్ర వచ్చే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుందన్నారు. కాబట్టి నిద్ర సమస్యలతో బాధపడేవారు పగటి నిద్రను మానేస్తే మంచిదని సూచిస్తున్నారు.
రాత్రుళ్లు ఎక్కువసేపు పని: రోజంతా పనులతో సతమతమైన మనసుకు, కండరాలకు విశ్రాంతి తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అప్పటి వరకూ మనల్ని చురుకుగా ఉంచిన అడ్రినలిన్ హార్మోన్ మోతాదులు తగ్గుముఖం పట్టేలా చూసుకోవాలని చెబుతున్నారు. పడుకోవటానికి కొద్ది గంటల ముందే శరీరాన్ని నిద్రకు సన్నద్ధం చేయాలని సూచిస్తున్నారు. అందువల్ల రాత్రి ఏ పనీ పెట్టుకోవద్దని వివరిస్తున్నారు. రాత్రి పూట ఇష్టమైన పుస్తకం చదవటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం, ధ్యానం చేయటం వంటి మనసుకు విశ్రాంతినిచ్చే పనులు చేయాలని సలహా ఇస్తున్నారు.
వ్యాయామం చేయకపోవటం: శారీరక శ్రమ నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయటం ఉత్తమమని తెలిపారు. ఇంకా ఆరుబయట నడక, పరుగు, సైకిల్ తొక్కటం వంటివి చేస్తే స్వచ్ఛమైన గాలికి మనసు, శరీరం ఉత్సాహంతో తొణికిసలాడి.. రాత్రిపూట గాఢంగానూ నిద్ర పడుతుందని చెబుతున్నారు.
వేళకు పడుకోకపోవటం: షిఫ్ట్ ఉద్యోగులు, తరచూ రాత్రిపూట ఆలస్యంగా పడుకునేవారిలో నిద్ర సమస్యలు తలెత్తటానికి ప్రధాన కారణం వేళకు నిద్ర పోకపోవడమేనని నిపుణులు అంటున్నారు. కాబట్టి రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం చాలా ముఖ్యమని.. దీంతో నిద్ర వేళలు నియమబద్ధం అవుతాయని చెబుతున్నారు. వీలైతే సాయంత్రం వేళ గోరు వెచ్చటి నీటితో స్నానం చేయటం, గ్లాసు పాలు తాగటం, ఇంట్లో లైట్ల వెలుగు తగ్గించుకోవటం ద్వారా మరింత త్వరగానూ నిద్ర పట్టేలా చూసుకోవచ్చని సూచిస్తున్నారు.
ఆలస్యంగా భోజనం: రాత్రిపూట ఆలస్యంగా పీకల దాకా భోజనం చేయటం, జీర్ణం కాని పదార్థాలు తినటం వల్ల గుండె వేగం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయని అంటున్నారు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయని.. అందుకే పడుకోవటానికి మూడు గంటల ముందే భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇంకా కొవ్వు పదార్థాలకు బదులు తేలికగా జీర్ణమయ్యేవి తినాలని సలహా ఇస్తున్నారు.
కాఫీ, టీ ఎక్కువగా వద్దు: ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కాఫీ, టీ ఎక్కువగా తాగేవారికి రాత్రి నిద్ర పట్టటం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే రాత్రి కూల్ డ్రింకులు, రెడ్ వైన్, చాక్లెట్లు, ఛీజ్ వంటివీ తినకూడదని.. ఇవి నిద్రకు చేటు చేస్తాయని వివరిస్తున్నారు. 2018లో Nutrients జర్నల్లో ప్రచురితమైన "The Relationship Between Diet and Daytime Sleepiness" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రి జడ వదిలేసుకునే పడుకుంటున్నారా? జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి!
ఈ సెట్టింగ్స్ చేస్తే కంప్యూటర్ ఎంత సేపు చూసినా ఇబ్బంది ఉండదట! అవేంటో మీకు తెలుసా?