Telangana Rythu Bharosa Scheme : రైతు భరోసా పథకం కింద తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదు జమవుతోంది. ఈ ఏడాది జనవరి 26న ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు కొన్ని గ్రామాల్లో, అక్కడక్కడ కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే నిధులు జమయ్యాయి. తిరిగి ఈ నెల 4 నుంచి పెట్టుబడి సాయం రైతు భరోసా ప్రక్రియ మొదలైంది.
యాసంగి పెట్టుబడి సాయం : బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయమందేది. దానినే కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పథకంగా మార్చి ఏడాదికి ఎకరాకు రూ.12వేల చొప్పున పెట్టుబడి సాయమందించాలని ఇటీవల నిర్ణయించింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు జమ చేస్తోంది. బుధవారం (ఫిబ్రవరి 05) వరకు ఎకరం లోపు రైతులకు పెట్టుబడి సాయమందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దశల వారీగా రైతు భరోసా : ఎకరం పైన విస్తీర్ణం కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు గురువారం (ఫిబ్రవరి 06) నుంచి జమవుతున్నాయి. ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరి ఖాతాలోనైనా నిధులు జమకాకుంటే అలాంటి వారి వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తారు. ఆన్‌లైన్‌లో పొందుపర్చి అర్హత కలిగిన రైతులందరికీ భరోసా అందేటట్లు చూస్తామని చెబుతున్నారు.
"అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి సాయమందిస్తుంది. ఇప్పటికే ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యాయి. దశల వారీగా అందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత కలిగినా బ్యాంకు ఖాతాలో నిధులు జమకాకుంటే సంబంధిత ఏఈఓను లేదా మండల వ్యవసాయశాఖ అధికారి(ఎంఏఓ)ని సంప్రదించాలి" -దనసరి పుల్లయ్య, డీఏఓ
వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా : జనవరి 26న ప్రారంభోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 563 గ్రామాలలో 9లక్షల 48వేల 333 ఎకరాలకు రూ.4,41,911మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.569 కోట్ల పెట్టుబడి సాయం బ్యాంకుల్లో వేశారు. విడతల వారీగా రాష్ట్రంలోని వ్యవసాయయోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలోనే చెల్లించేందుకు కృత నిశ్చయంతో ఉందన్నారు.
భూమి లేనివారికి ఆత్మీయ భరోసా, ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు, అన్నదాతకు రైతు భరోసా : మంత్రి తుమ్మల