How to Boil Eggs Properly: గుడ్డు ఎలా ఉడికించాలో మీకు తెలుసా? ఇదేం ప్రశ్న. గుడ్డు ఉడికించడం ఎలా అని కూడా అడుగుతారా? ఎంత సింపుల్ అది.. ఎవరికైనా తెలియకుండా ఉంటుందా? జస్ట్ నీటిలో గుడ్లు వేసి స్టౌ పైన పెట్టేస్తే అదే ఉడుకుతుంది కదా అనేస్తుంటాం. కానీ గుడ్డును ఉడకబెట్టే పద్ధతి అది కాదట! గుడ్డును ఉడకబెట్టే పద్ధతిపై పరిశోధనలు చేసి.. సరైన విధానాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. సరైన పోషకాలు, రంగు-రుచి కలిగి ఉండాలంటే గుడ్డును ఎలా ఉడికించాలో అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. సరిగ్గా ఉడికిన గుడ్డులో పచ్చ సొన మృదువుగా ఉంటుందని.. తెల్ల సొన మెత్తగా దట్టమైన తెలుపురంగు కలిగి ఉంటుందని వివరించారు. అయితే, ఈ సమతుల్యత సాధించడం మాత్రం ఒక సవాలేనని అంటున్నారు. ఎందుకంటే గుడ్డులోని రెండు సొనలు భిన్న ఉష్ణోగ్రతల వద్ద పరిపక్వ స్థితికి వస్తాయని తెలిపారు. అందుకోసమే శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేసి గుడ్డు ఎలా ఉడికించాలో నిర్ధరించారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు సరిగ్గా ఉడకాలంటే ముందుగా స్టౌ ఆన్ చేసి నీరు పోసి అందులో ఎగ్స్ వేసి మరిగించాలి. ఆ తర్వాత గుడ్లను మరుగుతున్న నీరున్న పాత్రలోంచి గోరువెచ్చని నీటిలోకి మార్చాలి. అనంతరం గోరువెచ్చని నీటిలో నుంచి మరుగుతున్న నీటిలోకి.. ఇలా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మారుస్తుండాలి. ఇలా మొత్తం 32 నిమిషాలు చేసిన తర్వాత చివరగా చల్లటి నీటి ప్రవాహం కింద ఉంచాలి. ఆపై చివర్లో పెంకు తీసేయాలి. ఇలా చేస్తే ఉడికించిన గుడ్డు.. బ్రెడ్డుపై స్ప్రెడ్ చేయడానికి వీలున్నంత మెత్తగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
ఉడికించిన గుడ్డు వల్ల లాభాలు:
ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ఉడకబెట్టిన గుడ్డులో ఆరు గ్రాముల అధిక నాణ్యత గలిగిన ప్రొటీన్ ఉంటుందట. ఇది కండరాలు అభివృద్ధికి చాలా బాగా తోడ్పడుతుందని తెలిపారు. అలాగే, దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌తో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12 అధికంగా ఉంటాయని వివరిస్తున్నారు.
బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్
ఇంకా ఉడికించిన గుడ్డులో కేలరీలు తక్కువగా ఉండి ప్రొటీన్స్తో పాటు ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అంటున్నారు. అమెరికా జర్నల్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం డైలీ ఒక ఉడికించిన గుడ్డు తినడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చని వివరిస్తున్నారు.
ఇవే కాకుండా ఇంకా మెదడు ఆరోగ్యానికి ఉడికించిన గుడ్డు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికంగా ఉండే కోలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుందని తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఓ రీసెర్చ్‌లోనూ ఈ విషయం తేలింది. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టీవీ చూస్తూ అన్నం తింటున్నారా? డిన్నర్లో ఈ తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవట!
రోజూ రాత్రి రీల్స్ చూస్తున్నారా? పరిశోధనలో కీలక విషయాలు- ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవట!