Viral Fever Increasing In Telangana : గత కొన్నిరోజులుగా మారిన వాతావరణంతో వైరల్ వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయి. ఎక్కువ మంది గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, చెవి ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతూ డాక్టర్లను సంప్రదిస్తున్నారు. పగలు వేడి, రాత్రి చలి కారణంగా వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరిని చాలా రోజులపాటు దగ్గు సమస్య వేధిస్తోంది. ఉస్మానియా, గాంధీ, ఈఎన్‌టీ, నిలోఫర్ తదితర ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మారిన వాతావరణంతో 0-5 ఏళ్ల పిల్లలు దగ్గు, జలుబు, జ్వరంతో వైద్యనిపుణులను సంప్రదిస్తున్నారు.
అనవసరంగా యాంటీ బయోటిక్స్ వద్దు : చిన్నగా దగ్గు, జలుబు, జ్వరం రాగానే చాలామంది డాక్టర్ల సలహా లేకుండానే యాంటిబయోటిక్స్‌ను మార్కెట్లో కొనుక్కొని వాడేస్తుంటారు. పిల్లలకు సైతం వీటిని తెచ్చి పట్టిస్తుంటారు. ఈ కాలంలో ఎక్కువగా వైరల్ వ్యాధులు ఉంటాయని, వీటికి యాంటీ బయోటిక్స్ వల్ల ఉపయోగం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
డాక్టర్లు సూచించేవరకు వాటిని వినియోగించొద్దని కిమ్స్ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శివరాజ్ వివరించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కొందరి పిల్లల్లో స్టెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల హైఫీవర్, గొంతు ఎర్రగా మారడం లాంటి లక్షణాలు వేధిస్తున్నాయని, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిలోఫర్ చిన్న పిల్లల వైద్య నిపుణులు డా.ఉషారాణి తెలిపారు.
ఇవీ లక్షణాలు :
- జ్వరం, ముక్కుకారడం, దగ్గు
- గొంతులో ఎర్రగా మారడం
- శరీరంపై ఎర్రని దద్దుర్లు.
- చెవి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, ముక్కు దిబ్బడ
- కొందరిలో న్యుమోనియా లక్షణాలు
ఈ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
- గుంపులోనికి వెళ్లినప్పుడు మాస్క్‌ను ధరించడం.
- కాచి, చల్లార్చి వడపోసిన నీటిని సేవించడం.
- వీళైనంత వరకు బయట నీళ్లు, ఆహారానికి దూరంగా ఉండటం.
- వేడి వల్ల శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం.
- ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలతో పాటు పండ్లు భాగం చేసుకోవాలి.
- రోజులో తప్పనిసరిగా 7-8 గ్లాసుల మంచి నీళ్లు తాగాలి.
- కనీసం 6-7 గంటలపాటు మెలకువ లేని నిద్ర అవసరం.
- ఎండ పెరిగేలోపే ఉదయపు నడక, వ్యాయామాలు ముగించడం ఉత్తమం.
- ఎండలో బయటకు వచ్చేటప్పుడు టోపీ, గాగుల్స్ లాంటివి ధరించడం అవసరం.
- అధిక నూనెలు, ముప్పు, వేపుళ్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి.
- 4-5 రోజులుగా జ్వరం తగ్గకపోయినా, నీరసం, నిస్సత్తువగా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
చలికాలంలో "వెల్లుల్లి రసం" - దగ్గు, జలుబుకి సూపర్ మెడిసిన్ - టేస్ట్ వేరే లెవల్!