Hair Loss Prevention Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని జుట్టు రాలడం వేధిస్తోంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను పరిష్కరించగలగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మిశ్రమంతో
ముందుగా కప్పు ఆముదం నూనెలో టీ స్పూన్ రోజ్‌మేరీ నూనె వేసి బాగా కలిపి ఈ నూనెల మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్‌లో భద్రపరచుకోవాలి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పట్టడం కొన్ని రోజుల్లోనే గమనించచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకూ ఈ నూనె తోడ్పడుతుందని వివరిస్తున్నారు.
కొబ్బరి పాలతో సిల్కీగా!
మనలో కొందరి జుట్టు గరుకుగా, గడ్డిలా మారుతుంది. ఇలాంటి జుట్టును రిపేర్ చేయడానికి కండిషనర్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం బయట మార్కెట్లో దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణ ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ పెట్టుకుని స్నానం చేస్తే జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుందని వివరిస్తున్నారు.
ఇవి గుర్తుపెట్టుకోండి!
ఇంకా కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి పడుకునే ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. కాసేపు కుదుళ్లను మసాజ్ చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2011లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "Effect of coconut oil on prevention of hair damage" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మనలో కొంత మంది రాత్రి పూట జుట్టు వదిలేసుకొని నిద్ర పోతుంటారు. ఫలితంగా కేశాలు గడ్డిలా, పిచ్చుక గూడులా మారతాయి. అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జడ వేసుకోవడం, పైకి ముడేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు. వీటితో పాటు తీసుకునే ఆహారంలో ఎ, బి, సి, డి, ఇ వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ 5 పనులు చేస్తే అందంగా కనిపిస్తారట! రక్త ప్రసరణ బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఈ సెట్టింగ్స్ చేస్తే కంప్యూటర్ ఎంత సేపు చూసినా ఇబ్బంది ఉండదట! అవేంటో మీకు తెలుసా?