Ravi Shastri On Pakistan : దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాక్ ఆతిథ్య జట్టు హోదాలో బరిలో దిగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భయంకరమైన పేస్ విభాగం, స్వదేశంలో టోర్నీ ఆడుతుండడం వల్ల పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక శక్తిగా మారగలదని హెచ్చరించాడు.
పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ సయీమ్ ఆయుబ్ పాక్ జట్టులో లేడని, అతడు నాణ్యమైన క్రికెటర్ అని రవిశాస్త్రి కొనియాడాడు. అయినప్పటికీ పాక్‌ను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ ప్లేయర్లు బాగా ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాలోనూ మెరుగైన ప్రదర్శన చేశారని పేర్కొన్నాడు. "ఇక స్వదేశంలో పాక్‌ను ఆపడం చాలా కష్టం. ఎవరైనా సరే హోంగ్రౌండ్స్లో డేంజరస్‌గా ఉంటారు. పాకిస్థాన్ కనుక సెమీస్‌కు చేరుకుంటే ఆ జట్టు డబుల్ డేంజరస్‌గా మారుతుంది" అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
సంచలనాలు సృష్టించే ప్లేయర్లు పాక్ సొంతం : పాంటింగ్
రవిశాస్త్రి వ్యాఖ్యలతో తాను అంగీకరిస్తున్నానని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సయీబ్ ఆయుబ్ దూరం అయ్యాడని, అతడు లేనిలోటు పాక్‌కు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కానీ, బ్యాటింగ్ తోపాటు బౌలింగ్‌లోనూ సంచలనాలు చేయగల సమర్థులు పాక్ సొంతమని కొనియాడాడు.
"పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్‌ను గమనిస్తే అర్థమవుతుంది. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా డేంజరస్‌గా ఉన్నారు. ఇటీవల సిరీస్‌లలో వారి పెర్ఫార్మెన్స్ బాగుంది. వారు ఎంతటి బ్యాటింగ్ లైనప్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. పాకిస్థాన్‌కు బాబర్ అజామ్ ఫామ్ చాలా కీలకం. బ్యాటింగ్ విషయంలో బాబర్ అజామ్, రిజ్వాన్ మరోసారి కీలకం కానున్నారు. వారిద్దరూ రాణిస్తే మాత్రం పాక్ ప్రమాదకరంగా మారుతుంది. స్వదేశంలో ఆడుతుండటం ప్రయోజనమే. కానీ మరో రకంగా ఒత్తిడితో కూడుకున్నదే. సొంత ప్రేక్షకుల మధ్య ఆడితే మద్దతు బాగుంటుంది. తమదైన రోజున పెద్ద జట్లనూ ఓడించగల సత్తా పాక్‌కు ఉంది" అని పాంటింగ్ విశ్లేషించాడు.
పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి జరగనుంది. దాయాది దేశం పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌ను కివీస్‌తో అదే రోజున తలపడనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్‌ను ఢీకొట్టనుంది. కాగా, భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి.