Kumbh Mela Traffic Jam Images : ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తడం వల్ల భారీ ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చిన లక్షలాది భక్తులు రహదారులపై చిక్కుకున్నారు. ఫలితంగా యూపీ పోలీసు యంత్రాంగం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
![Kumbh Mela Traffic Jam Images](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23511932_kk-1.jpeg)
సుమారు 48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నామని, 50 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 12 గంటల సమయం పడతుందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించలేని కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వేస్టేషన్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు వదంతులు వెలువడ్డాయి. అయితే అవి అసత్య వార్తలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఎనిమిది రైల్వేస్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ల నుంచి ఆదివారం 330 రైళ్లు బయలుదేరినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తుల వాహనాల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జాం అయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మరో రెండు రోజులు ప్రయాగ్‌రాజ్ యాత్ర వాయిదా వేసుకోవాలని కుంభమేళాకు వెళ్లే భక్తులకు విజ్ఞప్తి చేశారు.
![Kumbh Mela Traffic Jam Images](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23511932_kk-1.jpg)
'భక్తులూ మనుషులే- కనికరించండి!'
ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాల్లో భారీ ట్రాఫిక్‌జామ్ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాహాకుంభమేళా ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రాఫిక్‌జాం కారణంగా రహదారులపై చిక్కుకున్న లక్షలాది మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గంటగంటకు ట్రాఫిక్ రద్దీ పెరగుతుండడం వల్ల భక్తులు ఆహారం, విశ్రాంతి లేక నీరసించిపోతున్నారని పేర్కొన్నారు. సామాన్య భక్తులూ మనుషులే అనీ మానవతా దృక్పథంలో వాళ్లకీ అత్యవసర ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
![Kumbh Mela Traffic Jam Images](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23511932_kk-4.jpg)
'ప్లేస్ చాలక రైలు ఇంజిన్‌లోకి జనం!'
ప్రయాగ్‌రాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్‌లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు, వారణాసి మార్గంలో 12 నుంచి 15 కలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఇంజిన్‌లోకి కూడా ప్రయాణికులు ప్రవేశిస్తున్నారని, కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం కారణంగా జనజీవనం స్తంభించిందని మండిపడ్డారు. మహాకుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
![Kumbh Mela Traffic Jam Images](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23511932_kk-3.jpg)
ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్!
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే జబల్పుర్-రేవా రహదారిపై దాదాపు 350 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ఇంతలా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం చాలా అరుదు. ఇప్పటికి ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనా పేరిట ఉంది. చైనా రాజధాని బీజింగ్‌లో 2010లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 రోజుల పాటు ప్రజలు అప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి కూడా ఎక్కింది. 2012లో బ్రెజిల్‌లోని సావోల పాలోలో 300 కిలోమీటర్లు జామ్ అయిన ట్రాఫిక్‌లో వాహనదారులు 12-15 గంటలు చిక్కుకుపోయారు.