తెలంగాణ

telangana

ETV Bharat / international

పెన్సిల్వేనియాపై ట్రంప్, కమల స్పెషల్ ఫోకస్- ఒకేసారి ఇద్దరూ ప్రచారం- మొగ్గు ఎవరి వైపో?

పెన్సిల్వేనియా కోసం డెమోక్రాట్లు, రిపబ్లికన్లు తీవ్రంగా పోటీ- ఒకే సమయంలో హారిస్‌, ట్రంప్‌ పిట్స్‌బర్గ్‌లో ప్రచారం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 10:22 AM IST

US Election 2024 Trump Kamala : అమెరికా ఎన్నికల పోలింగ్‌ చివరి నిమిషంలో రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హారిస్‌ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో విజయానికి అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాపై ప్రత్యేక దృష్టిపెట్టారు. దాదాపు ఒకే సమయంలో ఇద్దరూ పిట్స్‌బర్గ్‌ నగరంలో ప్రచారం చేపట్టడం గమనార్హం. స్థానిక పీపీజీ పెయింట్స్‌ అరీనాలో ట్రంప్‌ సభ జరిగింది. అదే సమయంలో క్యారీ ఫర్నేస్​లో కమలా హారిస్‌ ర్యాలీ నిర్వహించారు.

పిట్స్‌బర్గ్ రావడాన్ని తాను థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బైడెన్‌ కార్యవర్గం లోపాలపై విరుచుకుపడ్డారు. ఇప్పటికంటే ప్రజలు గత నాలుగేళ్ల క్రితమే బాగున్నారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తానని, సరిహద్దు భద్రతను పెంచుతానని హామీ ఇచ్చారు. అమెరికాలో ఏటా మూడు లక్షల మంది ప్రాణాలు తీస్తున్న డ్రగ్స్‌ను అరికడతానని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా మాదక ద్రవ్యాల కారణంగా మరణాల సంఖ్య 90వేలు కాదు అంతకంటే ఎక్కువగానే ఉందని అన్నారు. గుండు సూది మొనంత ఫెంటనిల్‌ చాలు ప్రాణాలు తీయడానికి! తన పదవీకాలంలో అత్యధిక మంది క్రిమినల్స్‌ను అమెరికా నుంచి సాగనంపని తెలిపారు. వలసదారులు ఎవరైనా అమెరికన్లను హత్య చేస్తే వారికి మరణదండన విధించాలని, ఆ విధానాన్ని కమల నాశనం చేసిందని ఆరోపించారు. తాను దానిని సరిచేస్తానని వెల్లడించారు.

కచ్చితంగా ముగింపు పలకాల్సిందే!
మరోవైపు, కమలా హారిస్‌ కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు. తాము శ్రమించడాన్ని ఇష్టపడతామని తెలిపారు. గత కొన్నేళ్లుగా అమెరికన్లు పరస్పరం నిందించుకొంటున్నారని, సంకుచితమైపోతున్నారని అన్నారు. దానికి కచ్చితంగా ముగింపు పలకాల్సిందేనని నినదించారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగు, సమూహాలుగా కదలమని పిలుపునిచ్చారు. సమష్టి సమాజాన్ని నిర్మిద్దామని, విభజనలను కాదని పేర్కొన్నారు.

పెన్సిల్వేనియా ఎందుకు కీలకం?
అమెరికాలోని స్వింగ్‌ స్టేట్స్‌లో పెన్సిల్వేనియా ప్రధానమైంది. ఇక్కడ రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య పోరు తీవ్రంగా ఉంది. 270 మెజార్టీ మార్కును అందించడంలో 19 ఎలక్టోరల్‌ ఓట్లున్న ఈ రాష్ట్రం చాలా కీలకం. దీంతో ఇరుపార్టీల నామినీలు ఇక్కడకు చేరుకొని భారీగా ప్రచారం చేస్తున్నారు. 1948 నుంచి ఇక్కడ విజయం సాధించని ఏ డెమొక్రాట్‌ అభ్యర్థి అధ్యక్ష పీఠం ఎక్కలేదు. ఈ రాష్ట్రంలో 6,00,000 ఆసియా అమెరికన్లు ఉన్నారు. వీరిలో భారత మూలాలున్నవారు అత్యధిక మంది.

పోలింగ్ వేళ బైడెన్, ట్రంప్ పోస్టులు
మరోవైపు, ఓటర్లను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌లు చేశారు. ప్రజలంతా ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. కమలా హారిస్‌ ట్రంప్‌ను ఓడిస్తుందని తనకు తెలుసని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయమని కోరారు.

సంకీర్ణాన్ని నిర్మిద్దామన్న ట్రంప్
దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాజకీయ ఘట్టానికి చేరువలో ఉన్నామని, అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్రంప్ కోరారు. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చుదిద్దుకుందామని, దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద, విస్తృతమైన సంకీర్ణాన్ని నిర్మిద్దామని అన్నారు. శాంతిని కోరుకునే మిచిగాన్‌లోని అనేక మంది అరబ్‌, ముస్లిం ఓటర్లు కూడా ఈ ఓటింగ్‌ ప్రక్రియలో భాగస్వాములవుతారని తెలిపారు. కమలా హారిస్‌, ఆమె కేబినెట్‌ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుందని, ఆమె మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తారని ఓటర్లకు తెలుసని విమర్శించారు. అందుకే తనకు ఓటేసి శాంతిని పునరుద్ధరించండని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details