Sankranti Celebrations in Belgium : మాతృభూమికి దూరంగా ఉన్నా, మన తెలుగు వారి మనసంతా భారత భూమిపైనే ఉంటుంది. మన పండుగలు, వేడుకలు, సంప్రదాయాలను వేరే దేశం వెళ్లినా వారు మర్చిపోలేరు. మనమెంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సంబురాలను ఇప్పుడు మన తెలుగు వారు నివసిస్తున్న అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు. ఇలానే బెల్జియంలోనూ మన తెలుగు ప్రజలు సంక్రాంతి వేడుకలను అట్టహాసంగా అందరూ ఒక్కటై వైభవంగా నిర్వహించుకున్నారు.
ఆటపాటలతో సరదాగా : బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నివసిస్తున్న తెలుగు వారంతా సంక్రాంతి వేడుకల కోసం ఏకమయ్యారు. దీపా బెరింగే, అనిత కనుమూరి ఆధ్వర్యంలో సుమారు 350 మంది తెలుగు ప్రజలు ఈ సంబురాల కోసం తరలివచ్చారు. ఆటపాటలతో రోజంతా పిల్లా పాపలతో సందడిగా గడిపారు. చిన్నారులు, మహిళలు, పురుషులు తమ టాలెంట్ ప్రదర్శించారు. జన్మనిచ్చిన నేలకు దూరంగా ఉన్న తమకు, ఇలాంటి సంబురాలు ఎంతో ఉత్సాహం ఇస్తాయని వారు తెలిపారు. అందరం కలిసి జరుపుకుంటేనే పండుగ వేళ ఆనందం పెరుగుతుందన్నారు నిర్వాహకులు. రాబోయే రోజుల్లో వచ్చే పండుగలను సైతం రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటామని వెల్లడించారు.