BRS MLA Koushik Reddy Arrest : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ తీసుకెళుతున్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఆయనపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పీఏ కత్తురోజు వినోద్ అలియాస్ గిరి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ నేఫథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ వన్ టౌన్‌కు చేరుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కౌశిక్ రెడ్డి తీరుపై ఘాటుగా స్పందించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా దాదాపు 35 మంది కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ వెళ్లి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గతంలో జడ్పీ చైర్‌పర్సన్ సమావేశంలో కలెక్టర్‌ను అడ్డుకున్నారని, హుజురాబాద్‌లో దళిత బంధు నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టిన నేపథ్యంలోనూ పోలీసులు కేసు నమోదు చేసారు. కౌశిక్ రెడ్డిని ఇవాళ రాత్రి లేదా రేపు న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
— Harish Rao Thanneeru (@BRSHarish) January 13, 2025
మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా @KaushikReddyBRS మీద కేసులా?
కెసిఆర్ గారి పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల…
కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ఇలా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య
— KTR (@KTRBRS) January 13, 2025
పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారింది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి…
కౌశిక్‌రెడ్డి అరెస్టు అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. పూటకో అక్రమ కేసు రోజుకో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. కౌశిక్‌రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, హామీలపై ప్రశ్నిస్తే జవాబివ్వలేక అణచివేత చర్యలు పాల్పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. గులాబీ నేతల ఆత్మస్థైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీయలేదు, కౌశిక్‌రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఉద్రిక్తంగా మారిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ ధర్నా - అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిక!