Guidelines on New Ration Cards in Telangana : కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈనెల 26 నుంచి రేషన్ కార్డుల మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసింది. రేషన్ కార్డుల అర్హత ప్రమాణాల పరిశీలనకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఉపసంఘం నిర్ణయాల ప్రకారమే రేషన్ కార్డుల జారీ జరుగుతుంది. ఇటీవల జరిగిన కుల గణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా సిద్ధం చేశారు.
కొత్త ఆహార భద్రత కార్డుల జారీ సంబంధించి విధి విధానాలు ఇలా ఉన్నాయి. కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లు/జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించబడుతుంది. మండల స్థాయిలో ఎంపీడీఓ/యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)/డీసీఎస్‌ఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.
ముసాయిదా జాబితాను గ్రామసభ లేదా వార్డు సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు. గ్రామ సభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల / మున్సిపాల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్‌లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ / జీహెచ్‌ఎంసీ కమిషనర్ లాగిన్‌కు పంపాలి. ఆ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్ / జీహెచ్‌ఎంసీ కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే పౌరసరఫరాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపాలి.
ఫైనల్ లిస్ట్ ప్రకారం సీసీఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపులు చేయాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 26 నుంచి అర్హత ఉన్న కుటుంబాలు కొత్త ఆహార భద్రత కార్డులు పొందుతారని విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు.
కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ - కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల డేట్ ఇదే! - అప్లై చేసేందుకు మళ్లీ ఊరెళ్లాల్సిందే