Japan Earthquake Today : జపాన్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో దేశ నైరుతి ప్రాంతంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే మియాజాకితోపాటు కొచీ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
భూకంపం సంభవించిన 30 నిమిషాల్లోనే ఒక మీటరు ఎత్తైన సునామీ అలలు తీరాన్ని తాకినట్లు స్థానిక మీడియా తెలిపింది. నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ముందుజాగ్రత్త చర్యగా కొన్ని తీరప్రాంతాల్లోని నివాసితులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. మియాజాకి స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. క్యుషులో ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
గతేడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యుషు, షికోకులను కుదిపేశాయి. అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది జనవరి 1న సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందారు.