Azerbaijan Flight Crash Reason : అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిన ఘటనలో కుట్ర కోణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి ప్రయాణిస్తున్న విమానం కజఖ్‌స్థాన్‌లో కూలిపోయింది. పక్షి ఢీకొనడం వల్ల పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది. ఘటనలో 38 మంది చనిపోయారని ప్రకటించింది.
డ్రోన్‌గా భావించి కూల్చివేత?
అయితే విమాన ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే అందుకు కారణం. దానిని ఇక్రెయిన్‌కు చెందిన డ్రోన్‌గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు నెటిజన్లు అనుమానిస్తున్నారు.
స్పందించని డిప్యూటీ ప్రధాని!
ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం ఉపరితలంపై బుల్లెట్ ఆనవాళ్లు, రంధ్రాలు కనిపించినట్లు వెల్లడించాయి. అయితే ఈ కథనాలపై కజఖ్‌స్థాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించినా ఆయన స్పందించలేదు.