Russia Terror Attack Death Toll :రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్‌హాల్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 115మంది మృతిచెందారు. ఇప్పటికే కాల్పులు జరిపిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకోగా మరో 11 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్‌కు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ దాడులకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రకటన చేసింది.
రష్యాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికా నిఘావర్గాలు నెల క్రితమే హెచ్చరించాయి. అఫ్గాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు రష్యా నిఘావర్గాలకు చేరవేశాయి. రష్యాలోని అమెరికన్లు కూడా జాగ్రత్తగా ఉండాలని, కాన్సర్ట్‌లు, ప్రజలు గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నాయి. రష్యా దీన్ని పెడచెవిన పెట్టింది. ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ అమెరికా హెచ్చరికలను బహిరంగంగా ఖండించారు. రష్యా సమాజాన్ని అస్థిరపరచేలా, భయపెట్టేలా అమెరికా దాని మిత్రదేశాలు ప్రకటనలు చేస్తున్నాయని ఆరోపించారు.
మాస్కోలోని 6వేల మంది సామర్థ్యం కలిగిన క్రాకస్ సిటీ కాన్సర్ట్‌హాల్‌లో ముష్కరులు చొరబడి ఒక్కసారిగా కాల్పులకు ఒడిగట్టారు. గత 2 దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గురిపెట్టి ముష్కరులు పౌరుల ప్రాణాలు తీశారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. అనంతరం అక్కడ భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. వాటిని అదుపు చేసేందుకు గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. రష్యా వ్యాప్తంగా భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అన్ని ఈవెంట్లను రద్దు చేశామని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని రష్యా నేషనల్ గార్డు ప్రకటించింది.