తెలంగాణ

telangana

ETV Bharat / international

కరెంట్​ షాక్​తో ఇంటరాగేషన్!​- నేరాన్ని ఒప్పుకున్న రష్యా ఉగ్రదాడి నిందితులు - russia attack suspects - RUSSIA ATTACK SUSPECTS

Russia Attack Suspects : మాస్కోలో ఉగ్రదాడి చేసిన ముష్కరులు తమ నేరాన్ని కోర్టులో అంగీకరించారు. ఫలితంగా వారికి మే 22వరకు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దాడి వివరాలు కక్కించే ప్రయత్నంలో భాగంగా రష్యా భద్రతా బలగాలు ఉగ్రవాదులను తీవ్రంగా హించినట్లు తెలుస్తోంది. కోర్టు హాలులో 19 ఏళ్ల నిందితుడు అయితే ఏ మాత్రం చలనం లేకుండా ఉండిపోయాడు.

Russia Attack Suspects
Russia Attack Suspects

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 2:29 PM IST

Russia Attack Suspects : మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో ప్రత్యేక బలగాలకు చిక్కిన నలుగురిలో ముగ్గురు ముష్కరులు బాస్మన్నీ జిల్లా కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు. మిర్జోవ్, షంసిదిన్ ఫరీదున్, రాషబలిజోడా, ఫైజోవ్ అనే నలుగురు ముష్కరులు క్రాకస్‌సిటీ హాల్‌లో ఉన్న పౌరులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. దాడి తర్వాత పారిపోతుండగా బ్రియాన్స్క్‌ ప్రాంతంలో వారిని అరెస్టు చేసి విచారించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. అనంతరం వారిని కళ్లకు గంతలు కట్టి కోర్టులో హాజరు పరచగా, అందులో ముగ్గురు నేరాన్ని అంగీకరించారు. మరో వ్యక్తి మాత్రం వీల్‌ఛైర్‌కే పరిమితమై ఏమాత్రం మాట్లాడలేని అచేతనస్థితిలో ఉండిపోయాడు. వీరందరిని ఓ గాజు గదిలో ఉంచి మీడియా ముందు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం తజకిస్థాన్‌కు చెందిన ఈ నలుగురినీ మే 22 వరకు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. రష్యా చట్టాల ప్రకారం వీరందరికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

నిందితుడిని కోర్టులోకి తీసుకెళ్తున్న పోలీసులు

కరెంట్ షాక్​ ఇచ్చి ఇంటరాగేషన్​
కోర్టులో హాజరుపరచిన ఉగ్రవాదులను చూస్తే ఎంత తీవ్రంగా కొట్టారో అర్థమవుతోంది. విచారణ సందర్భంగా వారిని భద్రతా బలగాలు తీవ్రంగా కొడుతున్న వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అయ్యాయి. ఇంటరాగేషన్‌ సమయంలో వారికి కరెంట్‌ షాక్‌ కూడా ఇచ్చినట్లు సమాచారం. మిర్జోవ్‌, రాషబలిజోడాల కళ్ల వద్ద కమిలిపోయాయి. రాషబలిజోడా చెవిని కత్తిరించి, బ్యాండెయిడ్‌ వేసినట్లు తెలిసింది. ఫరిదుని అనే వ్యక్తి ముఖం అంతా వాచిపోయింది. 19ఏళ్ల ఫైజోవ్‌ అనే నిందితుడు వీల్‌ఛైర్‌కే పరిమితమై విచారణ సమయంలో స్పృహలోనే లేడని తెలిసింది. అతడి కన్ను పోయినట్లు సమాచారం.

కోర్టులో కూర్చున్న నిందితుడు

5వేల డాలర్ల కోసం దాడి
రెండు రోజుల క్రితం మాస్కోలోని క్రాకస్‌ సిటీ హాల్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. నలుగురు ఉగ్రవాదులు ప్రేక్షకులపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 137 మంది పౌరులు చనిపోగా, 180 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. వివరాలు తెలియని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబాలకు అందిస్తున్నారు. ఘటనకు ఐసిస్‌ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఇస్లామిక్‌ స్టేట్-ఖొరాసన్‌ ఉగ్రముఠా టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా నిందితులను సమన్వయం చేస్తూ పథకాన్ని అమలు చేసినట్లు సమాచారం. కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసినట్లు నిందితులు చెబుతున్నారు. 5 వేల 425 డాలర్లు ఇస్తామని చెప్పి అందులో సగాన్ని బ్యాంకుకు ముందే ట్రాన్స్‌ఫర్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరో 11 మంది అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు.

అప్రమత్తమైన ఫ్రాన్స్​
మరోవైపు రష్యాపై ఉగ్రదాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌ అప్రమత్తమైంది. ఇటీవల ఐసిస్‌ నుంచి బెదిరింపులు రావడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు. మధ్యప్రాచ్యంతో పాటు ఆఫ్రికాలో ఐసిస్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ దళాలు దాడులను నిర్వహించాయి. ఆ క్రమంలో 2015లో ఆ సంస్థ ఫ్రాన్స్‌పై ఉగ్రదాడి చేసింది. ఈ సారి పారిస్‌లో ఒలంపిక్స్‌ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచి ప్రభుత్వం ఆదేశించింది.

133కు చేరిన రష్యా ఉగ్రదాడి మృతుల సంఖ్య- నెల రోజుల క్రితమే అమెరికా వార్నింగ్​! - Russia Terror Attack Death toll

సంగీత కచేరీలో ఉగ్రవాదుల కాల్పులు - 60మంది మృతి, 145మందికి పైగా గాయాలు - Terror Attack In Russia

ABOUT THE AUTHOR

...view details