PM Modi Speech UAE Today :ఇటీవల అయోధ్య రామమందిరానికి, తాజాగా అబుదాబి హిందూ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రత్యక్ష సాక్షి కావడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అబుదాబిలోని అతిపెద్ద హిందూ రాతి ఆలయం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, మానవాళి ఉమ్మడి వారసత్వానికి చిహ్నమని తెలిపారు. తాను ఆలయ పూజారిగా అర్హుడినో కాదో తెలియదని, కానీ తాను 'భరతమాత' పూజారినని చెప్పారు.
'చరిత్రలో యూఏఈ ఒక సువర్ణ అధ్యాయం'
అబుదాబిలోని అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బూర్జ్ ఖలీఫా, షేక్ జాయెద్ మసీదుకు ప్రసిద్ధి చెందిన యూఏఈ, ఇప్పుడు తన గుర్తింపునకు మరో సాంస్కృతిక అధ్యాయాన్ని జోడించిందని మోదీ చెప్పారు. మానవాళి చరిత్రలో యూఏఈ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని తెలిపారు. ఆలయ నిర్మాణంలో యూఏఈ ప్రభుత్వ పాత్రను ప్రశంసించడానికి మాటలు సరిపోవని అన్నారు.
నహ్యాన్‌దే ముఖ్యపాత్ర
"ఈ గొప్ప ఆలయాన్ని సాకారం చేయడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే నా సోదరుడు (యూఏఈ అధ్యక్షుడు) షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌దే. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి యూఏఈ ప్రభుత్వం హృదయపూర్వకంగా పనిచేసింది. నహ్యాన్ ప్రభుత్వం ప్రవాస భారతీయుల హృదయాలను మాత్రమే కాకుండా మొత్తం 140 కోట్ల మంది భారత ప్రజల హృదయాలను కూడా గెలుచుకుంది. ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్య పర్యటకులు దర్శించుకోనున్నారు" అని మోదీ తెలిపారు.