Mutton Cooking Tips : పండగ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులు ముక్క రుచి చూడాల్సిందే. మెజారిటీ జనం ఆ రోజున మటన్‌కు ప్రయారిటీ ఇస్తారు. వారికి నిజమైన పండగ ముక్కతోనే మొదలవుతుంది. అయితే, మసాలాలు, సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి చక్కగా కర్రీ చేయడం ఒకెత్తు కాగా, మటన్ ముక్కలను సరిగ్గా ఉడికించడం మరొక ఎత్తు.
ఎందుకంటే ఆ మాంసం ఎంత ముదిరింది అన్న సంగతి చాలా మంది అంచనా వేయలేరు. ఈ కారణంగా మటన్ ఎంత సేపు ఉడికించాలనే విషయంలో తేడా వస్తుంది. కర్రీ మొత్తం ఉండికిందని స్టౌ మీద నుంచి దించేసి, వడ్డించిన తర్వాత కూడా ఒక్కోసారి మళ్లీ పొయ్యి మీదకు ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మేం చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే సరి. చక్కగా, మెత్తగా ఉడికిపోద్ది. ఇష్టంగా ఆరగించేయొచ్చు.
చాయ్ డికాషన్ :
మటన్ చక్కగా ఉడికించడానికి మరొక పద్ధతి చాయ్ డికాషన్. చక్కెర వేయకుండా డికాషన్ మరగబెట్టిండి. ఇప్పుడు జాలితో టీపొడి మొత్తం వడకట్టండి. ఆ తర్వాత డికాషన్ వాటర్‌ను, క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ గిన్నెలో పోయండి. అలా ఒక గంటపాటు నానబెట్టండి. ఆ తర్వాత మీ పద్ధతిలో కుక్ చేస్కుంటే సరిపోతుంది. మటన్ చాలా చక్కగా ఉడుకుతుంది. ఈ డికాషన్‌లో ఉండే ట్యానిన్లు మాంసం ముక్కలను మెత్తగా ఉడికేలా చేస్తాయి.
వెనిగర్ / నిమ్మరసం :
నిమ్మ రసం, వెనిగర్ కూడా మటన్ ముక్కలు ఫాస్ట్‌గా ఉడికేలా చేస్తాయి. లెమన్ జ్యూస్, వెనిగర్ యాసిడ్ లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి అవి మటన్ ముక్కలను చక్కగా ఉడికించడంలో కీలక పాత్రపోషిస్తాయి. అంతేకాదు కర్రీకి మంచి ఫ్లేవర్ ను కూడా తీసుకొస్తాయి.
ఉప్పు :
మొదట మటన్ శుభ్రం చేసుకున్నప్పుడు గిన్నెలో కాస్త నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా మొత్తం వంపేయండి. ఆ తర్వాత మటన్‌లో కాస్త రాక్ సాల్ట్ వేయండి. ఈ ఉప్పు వేసి, అదంతా చక్కగా మటన్‌కు పట్టేలా మిక్స్ చేసి ఒక గంట మ్యారినేట్ చేయండి. ఆ తర్వాత మీ రెగ్యులర్ పద్ధతిలో వండేస్తే సరి. చాలా త్వరగా, మెత్తగా ఉడికిపోతుంది.
బొప్పాయి :
మటన్ ముక్కలు మెత్తగా కుక్ కావడానికి మరొక మంచి చిట్కా బొప్పాయి. కర్రీలో బొప్పాయి ఆకుగానీ లేదంటే పచ్చి బొప్పాయి కాయ ముక్కలు గానే వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే పదార్థం మాంసం ముక్కల్లోని బంధాలు విడిపోవడానికి కారణం అవుతుంది. దీంతో ముక్కలు మెత్తగా ఉడుకుతాయి.
టమాటాలు :
టమాటాల్లో కూడా యాసిడ్ లక్షణం ఉంటుంది. టమాటాలను పేస్ట్ చేసి కర్రీలో వేసినా, లేదంటే టమాటా సాస్ వేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. నాన్‌వెజ్‌లో టమాటాలు వేయడం చాలా మంది చేస్తూనే ఉంటారు. అయితే, చాలా మంది కర్రీ సగం ఉడికిన తర్వాత వేస్తారు. అలా కాకుండా తాళింపు సమయంలోనే టమాటాలు వేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా ఉడికే అవకాశం ఉంది.
పెరుగు :
మటన్ కర్రీ ఉడికించడానికి ముందు ఒక గంటసేపు పెరుగులో నానబెట్టాలి. ఇలా చేస్తే ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి. పెరుగు లేకపోతే మజ్జిగ కూడా వాడొచ్చు. ఈ పెరుగు వల్ల మటన్ ముక్కలు త్వరాగ ఉడకడమే కాకుండా, మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం సైతం అందుతుంది.
అల్లం :
అల్లం కూడా మటన్ త్వరగా ఉడికేలా చేస్తుంది. ఇందులో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ ముక్కలను చక్కగా కుక్ చేస్తాయి. అయితే, దాదాపుగా అందరూ అల్లం, వెల్లుల్లి పేస్టును కలిపి మిక్సీ పట్టుకుంటారు. అదే పేస్టును కూరలో వేసేస్తారు. కానీ, అల్లం విడిగా కూర మొదట్లోనే వేసుకోవాలి. దీనివల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. వెల్లుల్లి పేస్టు చివరలో వేసుకోవచ్చు.