తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో మంకీపాక్స్ కలకలం- స్వీడన్​లో తొలి కేసు- వైరస్ లక్షణాలేంటంటే? - Monkeypox Virus In Pakistan

Monkeypox Virus In Pakistan : ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ఎంపాక్స్‌ వైరస్‌ మన పొరుగుదేశం పాకిస్థాన్‌కు చేరింది. సౌదీ నుంచి వచ్చిన ముగ్గురు పాక్‌ పౌరులకు మంకీపాక్స్‌ వ్యాధి నిర్ధరణ అయింది. ఆగస్టు 3న వారు స్వదేశానికి చేరడం వల్ల ఎంతమందిని కలిశారన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఐరోపా దేశం స్వీడన్‌లో కూడా తొలి కేసు వెలుగుచూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Monkeypox Virus In Pakistan
Monkeypox Virus In Pakistan (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 6:01 PM IST

Updated : Aug 16, 2024, 7:15 PM IST

Monkeypox Virus In Pakistan : ఆఫ్రికా దేశాల్లో అలజడి సృష్టిస్తోన్న మంకీపాక్స్ మహమ్మారి మన పొరుగుదేశం పాకిస్థాన్‌కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లో ముగ్గురికి మంకీ పాక్స్ సోకినట్లుగా అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ముగ్గురు పాకిస్థానీలు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వచ్చినట్లు సమాచారం. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్‌ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.

'భయపడాల్సిన అవసరం లేదు'
విమానంలో వారితో ప్రయాణించిన వ్యక్తులతో పాటు సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా పాక్‌ ఆరోగ్యశాఖ పేర్కొంది. 2023లో పాక్‌లో 11 మంకీపాక్స్‌ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. అయితే భారత్​లో మంకీపాక్స్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. భయపడాల్సిన అవసరం లేదని చెప్పాయి. మన దేశంలో చివరి ఎంపాక్స్ కేసు ఈ ఏడాది మార్చిలో కేరళలో బయటపడింది.

96శాతం కాంగోలోనే!
Monkeypox In Africa Countries :ఆఫ్రికా దేశాలను ఇప్పటికే మంకీపాక్స్‌ వణికిస్తోంది. ఆఫ్రికాలో నమోదైన ఎంపాక్స్‌ కేసుల్లో 96శాతం కాంగోలోనే ఉన్నాయి. చుట్టుపక్కల 13 దేశాల్లో మిగిలిన కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం క్లేడ్‌ 1 వేరియంట్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఇందులో మరణాల శాతం అధికం. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన కేసుల్లో 10శాతం మరణాల రేటు ఉండగా ప్రస్తుతం అది 3 నుంచి 4 శాతంగా ఉన్నట్లు ఆఫ్రికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది. ఐరోపా దేశం స్వీడన్‌లో కూడా ఎంపాక్స్‌ తొలి కేసు నమోదైంది. ఇప్పటివరకు 122 దేశాల్లో 99,518 కేసులు వెలుగుచూసినట్లు WHO తెలిపింది.

గతంలో ఎంపాక్స్‌ ఛాతీ, చేతులు, పాదాలపై ప్రభావం చూపితే ప్రస్తుత వేరియంట్‌ జననాంగాలపై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రోగుల గుర్తింపు కష్టంగా మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2024లో ఇప్పటివరకు 15వేల 600లకు పైగా మంకీపాక్స్‌ కేసులు నమోదు కాగా 537 మందికి పైగా బలయ్యారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చేతుల దురద, పొక్కులు దీని లక్షణాలు. కళ్లు, నోరు, మల, మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. రోగికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది.

వ్యాధి ప్రభావ రీత్యా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్​ కూడా మంకీపాక్స్ వైరస్ విషయంపై ఎక్స్​లో పోస్ట్​ పెట్టారు. "స్వీడన్​లో ఎంపాక్స్ తొలి కేసు నమోదవ్వడం, వైరస్​ను కలిసికట్టుగా దేశాలు ఎదుర్కోవాలని సూచిస్తుంది. వైరస్ వ్యాప్తి విషయంలో డేటా షేర్ చేసుకోవాలని అన్ని దేశాలను ప్రోత్సహిస్తున్నాం. వ్యాక్సిన్లను ఇచ్చిపుచ్చుకోవాలి. ప్రస్తుతం వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే నేర్చుకున్న పాఠాలను అమలుపరచాలి" అని ట్వీట్ చేశారు.

'మంకీపాక్స్ విషయంలో అలా చేయొద్దు'.. ప్రజలకు కేంద్రం కీలక సూచనలు

మంకీపాక్స్ విజృంభణ,​ వ్యాక్సిన్​పై డబ్ల్యూహెచ్​ఓ కీలక వ్యాఖ్యలు

Last Updated : Aug 16, 2024, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details