Modi Bhutan Visit :భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ఈ అవార్డును స్వీకరించారు.
ఐదు లక్షల టీకాలను అందించినందుకు!
Bhutan Highest Civilian Award To Modi : ప్రధాని మోదీకి ఈ పౌర పురస్కారాన్ని 2021లోనే ప్రకటించింది భూటాన్. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తూ, కొవిడ్ సమయంలో ఐదు లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించింది. ఈ పురస్కారం అందుకోవడం గౌరవంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు.
'భారతీయుడి తరఫున గౌరవాన్ని అంగీకరిస్తున్నా'
"నా జీవితంలో చాలా పెద్ద రోజు. నాకు భూటాన్ అత్యున్నత పౌర గౌరవం లభించింది. ప్రతి అవార్డు ప్రత్యేకమైంది. కానీ మీరు మరొక దేశం నుంచి అవార్డు అందుకున్నప్పుడు, రెండుదేశాలు సరైన మార్గంలో పయనిస్తున్నాయని ఇది సూచిస్తుంది. ప్రతి భారతీయుడి తరఫున నేను ఈ గౌరవాన్ని అంగీకరిస్తున్నాను. అవార్డు ఇచ్చినందుకు కోట్లాది ధన్యవాదాలు" అని నరేంద్ర మోదీ తెలిపారు.