Israel Attack On Hezbollah : ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ సహా ఇతర మిత్రదేశాలు ఇచ్చిన 21 రోజుల కాల్పుల విరమణ పిలుపును బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం బేఖాతరు చేసింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై విరుచుకుపడాలని, అందుకు పూర్తి స్థాయి దళాలను వాడాలని ఇజ్రాయెల్ సైన్యానికి ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. హెజ్‌బొల్లాపై విజయం సాధించే వరకు దాడులు ఆపకూడదని నెతన్యాహు పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్‌కు వెళ్లే ముందు ఆదేశించినట్టు పేర్కొంది.
భూతల దాడులకు సిద్ధం!
నెతన్యాహు విదేశీ పర్యటనల వేళ తాత్కాలిక ప్రధానిగా ఉండే ఆ దేశ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కాల్పుల విరమణ లేదనే విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. లెబనాన్‌పై ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం, భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెబనాన్‌పై భూతల దాడులు చేసే అవకాశం ఉందని బహిరంగ వ్యాఖ్యలు చేయడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. లెబనాన్ సరిహద్దుల సమీపంలోని దళాలను భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు.
అలా అయితే మద్దతివ్వం!
హెజ్‌బొల్లాను అంతం చేయడం ద్వారా మాత్రమే ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం దొరుకుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉందని, అది హెజ్‌బొల్లాను అంతం చేయడమని ఇజ్రాయెల్ రెవెన్యూశాఖ మంత్రి స్మోట్రిచ్ వెల్లడించారు. అమెరికా, ఫ్రాన్స్ చెప్పినట్లుగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే హెజ్‌బొల్లా కోలుకునేందుకు సమయం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరిస్తే నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం నుంచి తమ మద్దతు ఉపసంహరించుకుంటామని జ్యూయిష్ పవర్ పార్టీ అధినేత ఇటమార్ బెన్-గ్విర్ ప్రకటించారు.