Indo Americans On Human Rights :మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు కూర్చోని చర్చించుకోవడం మేలని వారు సూచించారు. 'దేశీ డిసైడ్స్' పేరిట నిర్వహించిన సదస్సులో పాల్గొన్న భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇతర దేశాలకు హితవు చెప్పేముందు అమెరికా వ్యవస్థలోని లోపాలనూ గమనించుకోవాల్సిన అవసరం ఉందని సభలో పాల్గొన్న ఆ దేశ చట్టసభ సభ్యుడు రో ఖన్నాఅన్నారు. భారత్ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందని ఖన్నా గుర్తు చేశారు. వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు తమకు ఉపన్యాసాలు ఇస్తున్నాయని భారత్ స్పష్టంగా చెబుతుందని అలాంటప్పుడు మన మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవన్నారు. ఇరు దేశాల్లోని లోపాలను గుర్తించి వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలనే ధోరణిలో చర్చించుకుంటే మేలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ, బలమైన ప్రతిపక్షం ఉండాలని మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు అమీ బేరా తెలిపారు. అమెరికాకు భారత్ కీలక భాగస్వామి మరో సభ్యురాలు ప్రమీలా జయపాల్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలతో పాటు ఇతర అంశాల్లో అమెరికాకు భారత్ అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండియా-యూఎస్ మైత్రి మరింత బలపడాల్సిన అవసరం ఉందని మరో సభ్యుడు థానేదార్ తెలిపారు. రష్యాను భారత్ విడిచిపెట్టి పూర్తిగా అమెరికాతో బంధాన్ని బలపర్చుకోవాలని హితవు పలికారు. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ ఒక్కటే పరిష్కారమని అభిప్రాయపడ్డారు.