America Shutdown News : ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలకమైన బిల్లు ఆమోదం పొందని నేపథ్యంలో అమెరికా షట్‌డౌన్ ముప్పును ఎదుర్కొంటోంది. వాస్తవానికి తొలుత బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మార్చి 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రెండేళ్లపాటు రుణాలపై సీలింగ్‌ను సస్పెండ్ చేయడం మొదలైన ట్రంప్ డిమాండ్లను ఇందులో చేర్చారు.
దీంతో కాబోయే అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ, మిగిలినవారు కూడా సానుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. దీనిని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా ప్రతినిధుల సభ కూడా దీనిని 235-174తో తిరస్కరించింది. అంతేకాదు ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. మరోవైపు ప్రస్తుతానికి సెనెట్‌లో డెమోక్రాట్ల పట్టు కొనసాగుతోంది. దీంతో శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది.
షట్‌డౌన్ ప్రభావం ఎలా ఉంటుందంటే?
అమెరికాలోని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై షట్‌డౌన్ ప్రభావం పడుతుంది. దాదాపు 8,75,000 మంది ఉద్యోగుల పనులు, జీతాలు నిలిచిపోయే అవకాశం ఉంది. వీరిలో చాలా మందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయవద్దని చెబుతారని బైపార్టీసన్ పాలసీ సెంటర్ డైరెక్టర్ అక్బాస్ వెల్లడించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని మరో 14 లక్షల మంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది. వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకొని చెక్ ఇవ్వరని ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సంఘం పేర్కొంది. షట్‌డౌన్ ముగిశాకే, వారికి పాత వేతనాలు చెల్లింపులు జరుగుతాయని పేర్కొంది. కొన్ని కాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలు ఉండవని తెలిపింది. అమెరికా శత్రువులకు ఈ షట్‌డౌన్ ఓ క్రిస్మస్ కానుక అవుతుందని అభివర్ణించింది. మరీ ముఖ్యంగా రవాణశాఖ, ఇతర రంగాలపై ఈ షట్‌డౌన్ ముప్పు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఏ విభాగాలపై ప్రభావం?
సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులపై షట్‌డౌన్ ప్రభావం పెద్దగా ఉండదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది. వీటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు. కానీ, సోషల్ సెక్యూరిటీ ఆఫీస్‌లు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడతాయి. 2013లో వందలకొద్దీ పార్కులు, మ్యూజియంలు, ఇతర ప్రదేశాలను మూసేశారు. వాస్తవానికి అమెరికాలో షట్‌డౌన్ మొదలైతే, అది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేము. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. నాడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్ కావడం గమనార్హం.