Obama Campaign To Support Harris :రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్ట్ ట్రంప్ తమకు మేలు చేస్తారని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ట్రంప్ తన అహం, డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారని ఆరోపించారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
'కమలా హారిస్ అలా చేయగలరు'
ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే అమెరికాకు కావాలని ఒబామా అభిప్రాయపడ్డారు. కమలా హారిస్ మాత్రమే అలా చేయగలరని తాను నమ్ముతున్నానని వెల్లడించారు. "ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు నేను అర్థం చేసుకున్నాను. ఈ ఎన్నికలు చాలా కఠినంగా ఉండనున్నాయి. ఎందుకంటే చాలా మంది అమెరికన్లు ఇంకా సమస్యలతోనే పోరాడుతున్నారు. హారిస్ గతంలోనే అధ్యక్ష అభ్యర్థిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు" అని ఒబామా వ్యాఖ్యానించారు.
హారిస్‌కు మద్దతు ప్రకటించిన ఒబామా
కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఆయన మద్దతిచ్చారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం కమలా హారిస్‌కు పూర్తి మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆమె తరఫున ప్రచారం కూడా చేశారు.
'భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తా'
తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ విదేశీ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తోందని ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని, ఆ దేశంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. అయినప్పటికీ భారత్ విదేశీ వస్తువులపై అధిక సుంకాన్ని విధిస్తోందని తెలిపారు. డెట్రాయిట్లో ప్రధాన ఆర్థిక విధాన ప్రసంగంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అమెరికాను మళ్లీ సుసంపన్నంగా మార్చడమే నా లక్ష్యం. అమెరికా దిగుమతి వస్తువులపై చైనా 200 శాతం సుంకాన్ని వసూలు చేస్తుంది. అలాగే బ్రెజిల్ కూడా అంతే మొత్తంలో తీసుకుంటుంది. భారత ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి" అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.