Donald Trump Inauguration Ceremony :డొనాల్డ్ రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం ప్రకారం) అతిరథ మహారథుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో ప్రమాణ స్వీకారోత్సవ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వాషింగ్టన్‌లో తీవ్రమైన చలి ఉంది. దీంతో ఈసారి ఈ కార్యక్రమాన్ని భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో నిర్వహించారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్యాపిటల్ హిల్ భవనం వెలుపల శతఘ్నులను పేల్చారు. అనంతరం రొటుండా హాల్‌లో జాతీయగీతం ఆలపించారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్‌నకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఇతర ప్రముఖులు అభినందనలు చెప్పారు.
అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ప్రమాణం చేయించారు. పక్కన తన కుమార్తెను ఎత్తుకుని ఉషా వాన్స్ నిల్చున్నారు. ప్రమాణం అనంతరం అక్కడున్న వారంతా కేరింతలతో జేడీ వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అతిరథ మహారథులు హాజరు
ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో భారత్ నుంచి అంబానీ దంపతులు పాల్గొన్నారు. అంబానీ కుటుంబానికి ట్రంప్ కుటుంబం ప్రత్యేకంగా ఆహ్వానం పంపిందని ఓ వార్తా సంస్థ తెలిపింది. వీరితో పాటు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా హాజరయ్యారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు లేఖ పంపించారు. మోదీ తరఫున ప్రతినిధిగా వాషింగ్టన్‌కు వెళ్లిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ దీనిని ఆయనకు అందజేశారు. దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు మన దేశం తరఫున ప్రత్యేక ప్రతినిధుల్ని పంపించడం ఆనవాయితీగా వస్తోంది. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు కారణాలతో రాలేకపోతున్నట్లు చైనా అధ్యక్షుడు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్‌నకు చెప్పారు.
ట్రంప్‌నకు మోదీ, పుతిన్ విషెస్
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. "నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు, ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆయన పదవీకాలం ఫలప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌నకు రష్యా అధినేత పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. రష్యాతో సంబంధాల పునరుద్ధరణ, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్, ఆయన బృందం చేసిన ప్రకటనలను స్వాగతిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.