Trump Lay Offs Plan : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా ప్రభుత్వంలోని ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఆయన సిద్ధమయ్యారు. వాళ్లందరినీ ఇవాళ (బుధవారం) సాయంత్రం 5 గంటల్లోగా వేతనంతో కూడిన సెలవుపై పంపాలంటూ కీలక ఆదేశాల మెమోను జారీ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ విభాగం నియంత్రించే అన్ని వెబ్‌పేజీలను కూడా ఈరోజు సాయంత్రంలోగా డీయాక్టివేట్ చేయాలని ట్రంప్ నిర్దేశించారు.
ట్రంప్ షాకింగ్ డెసిషన్- ఆ ఉద్యోగులంతా ఇంటికే పరిమితమా? - TRUMP LAY OFFS PLAN
'ప్రభుత్వ డీఈఐ విభాగం సిబ్బందిని సాయంత్రంలోగా సెలవుపై పంపండి'- కీలక మెమో జారీ చేసిన ప్రెసిడెంట్ ట్రంప్- ఆయా విభాగాల వెబ్‌పేజీలు డీయాక్టివేట్ చేయాలని నిర్దేశం
Published : Jan 22, 2025, 11:30 AM IST
వాస్తవానికి ట్రంప్ ఈ మెమోను జారీ చేయడానికి ముందే కొన్ని ప్రభుత్వ విభాగాలు తమ వెబ్‌పేజీలను డీయాక్టివేట్ చేయడం గమనార్హం. డీఈఐ విభాగం నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, అది కుదుర్చుకున్న ఒప్పందాలను సైతం తక్షణమే రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఈ ఆదేశాలను ధిక్కరించే డీఈఐ విభాగాలపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఆయా విభాగాల్లో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరుగుతున్నట్లు గుర్తిస్తే తమకు పదిరోజుల్లోగా సమాచారం ఇవ్వాలని డీఈఐ సిబ్బందికి ట్రంప్ ప్రభుత్వంలోని సిబ్బంది మంత్రిత్వ శాఖ సూచించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ డీఈఐ విభాగం ఆఫీసుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను రేపటి(గురువారం) కల్లా తమకు అందజేయాలని సంబంధిత ఉన్నతాధికారులను కోరింది.
ఉద్యోగుల్లో ఎంత మందిని విధుల్లో కొనసాగించాలి ? సిబ్బంది సంఖ్యను ఎంతకు తగ్గించాలి ? అనే దానిపై వచ్చే శుక్రవారం కల్లా సిబ్బంది మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అమెరికాలో ప్రభుత్వ పథకాల అమలులో డీఈఐ విభాగం సిబ్బంది కీలక పాత్ర పోషిస్తుంటారు. ఆ విభాగంలో నిర్మాణాత్మక మార్పులు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. తమ ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా అది పనిచేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే శుక్రవారం నాటికి వీరికి లేఆఫ్‌లు ఇచ్చి ఫెడరల్ సిబ్బంది సంఖ్యలో కోత విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేస్తూ ఇప్పటికే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఆదేశాలను (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) ట్రంప్ జారీ చేశారు.