China Lottery Winner :పది కాదు, ఇరవై కాదు, లాటరీలో ఏకంగా రూ.796 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నిర్వహించే లాటరీలో గెలుచుకున్నాడు గోయ్జో రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి. చైనాలో ఓ వ్యక్తి గెలుచుకున్న అతిపెద్ద లాటరీ మొత్తం ఇదే కావడం విశేషం. 'చైనా వెల్ఫేర్ లాటరీ' అనే ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న సంస్థ ఈ టికెట్లను విక్రయించింది. జాక్‌పాట్ కొట్టిన వ్యాపారవేత్త మొత్తం 133 టికెట్లను కొనుగోలు చేశాడు. ఒక్కో టికెట్‌ను రెండు యువాన్ల (సుమారు రూ.24)కు కొన్నాడు. ఏడు నంబర్లతో కూడిన ఒకే సిరీస్‌పై అన్ని టికెట్లతో బెట్టింగ్ వేశాడు. లాటరీలో ఆ నంబర్‌కే జాక్‌పాట్ తగిలింది. దీంతో ఒక్కో టికెట్‌పై 5.16 మిలియన్ యువాన్ల (7.25 లక్షల డాలర్లు) చొప్పున గెలుచుకున్నాడు. మొత్తం 133 టికెట్లకు 680 మిలియన్ యువాన్లు (96 మిలియన్ డాలర్లు) వచ్చాయి. ఈ మొత్తం భారత కరెన్సీలో రూ.796 కోట్లకు సమానం.
విజయ రహస్యం ఇదే!
లాటరీ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని విజేతగా నిలిచిన వ్యాపారవేత్త చెప్పాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తనకు నిద్ర కూడా పట్టలేదని అన్నాడు. 'తొలుత నేను నమ్మలేదు. తర్వాత పలుమార్లు చెక్ చేసుకున్నా. ఆ ఎగ్జైట్మెంట్లో నాకు నిద్ర పట్టలేదు' అని చెప్పుకొచ్చాడు. 'గత లాటరీలను నేను గమనించాను. ఏ నంబర్లకు జాక్‌పాట్ తగిలిందనే విషయంపై పరిశోధన చేశా. అలాంటి నంబర్లను ఎంపిక చేసుకొని, నా లక్కీ నంబర్‌ను కూడా జత చేసి బెట్ వేశా. ఇలాంటి సిరీస్‌పై నేను చాలా కాలంగా బెట్ వేస్తున్నా. లాటరీ గెలిచిన విషయాన్ని నేను నా కుటుంబ సభ్యులకు ఇంకా చెప్పలేదు. వచ్చే సెలవుల సీజన్లో వారికి ఈ విషయం చెబుతా' అని వ్యాపారవేత్త పేర్కొన్నాడు.