Sheikh Hasina Passport Revoked :బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది. ఆమెతోపాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లకు సంబంధించిన బాధ్యులపై నేర విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టు రద్దు - యూనస్ సర్కార్ ప్రతీకార చర్యలు! - SHEIKH HASINA PASSPORT REVOKED
షేక్ హసీనా పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన యూనస్ సర్కార్ - మరో 96 మందిది కూడా!
Published : Jan 8, 2025, 7:07 AM IST
అరెస్ట్ వారెంట్
బంగ్లాదేశ్ సర్కార్ పాస్‌పోర్టు రద్దు చేసిన వారిలో 22 మందిపై కిడ్నాప్ కేసులు ఉండగా, 75 మందిపై హత్య కేసులు ఉన్నాయి. కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడ్డారంటూ షేక్ హసీనాతోపాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ (ఐసీటీ) సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అది జరిగిన వెంటనే షేక్ హసీనా పాస్‌పోర్ట్ రద్దు చేయడం గమనార్హం. ఫిబ్రవరి 12లోగా హసీనాతోపాటు మిగతా వారందర్నీ అరెస్టు చేయాలని ఐసీటీ తన ఆదేశాల్లో పేర్కొంది.
ఇంతకూ ఏం జరిగింది?
1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో అసువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10 శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10 శాతం మహిళలకు, 5 శాతం మైనారిటీ తెగల వారికి, 1 శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. తరువాత బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్‌షాహీ, ఖుల్నా, చత్తోగ్రాంలలో గతేడాది జులై, ఆగస్టు నెలల్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఉద్రిక్తతలను ఆపలేక ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వ హయంలో బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం వీటిని అరికట్టలేకపోతోంది.