Elon Musk Vs Vivek Ramaswamy In DOGE : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాపరమైన సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన విభాగం 'డోజ్' (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ). ఈ విభాగానికి సారథులుగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. అయితే 'డోజ్'లో ఉండలేనంటూ రామస్వామి తప్పుకోవడానికి గల కారణమేంటి అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. వివేక్ రామస్వామి డోజ్‌లో ఉండకూడదని మస్క్ భావించారని, అందుకే ఆయన వైదొలగి ఉండొచ్చంటూ అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాధ్యతలు, విధుల పంపిణీ అంశంపై వాళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఉంటాయని ఆ కథనాల్లో ప్రస్తావించారు. అందుకే ట్రంప్ దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల్లోనే డోజ్ నుంచి వైదొలగుతున్నట్లు వివేక్ ప్రకటన చేశారని కథనాల్లో ప్రస్తావించారు.
డోజ్ నిర్మాణంలో కీలక పాత్ర
ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే వరకు 'డోజ్' విభాగం నిర్మాణానికి సంబంధించిన పనుల్లో వివేక్ చురుగ్గా పాల్గొన్నారు. అది ఎలా పనిచేయాలి ? ఏయే అంశాలను ప్రాథమికంగా పర్యవేక్షించాలి ? పాలనా వ్యవస్థను ఎలా సంస్కరించాలి ? ప్రభుత్వ విభాగాల్లో మానవ వనరులు ఎంత ఉండాలి? వాటి నిర్వహణ ఎలా? అనే అంశాలపై పూర్తి విధివిధానాలను డోజ్ సిద్ధం చేసుకుంది. ఇదంతా అయ్యాక డిసెంబరు మొదటి వారం నుంచి డోజ్ సంబంధిత పనులకు వివేక్ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. డోజ్‌కు తనవంతు చేదోడు అందించడం ద్వారా ట్రంప్ దృష్టిలో తన ఇమేజ్‌ను వివేక్ పెంచుకున్నారు. అందుకే ఆయన తదుపరిగా ఒహియో రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీచేయాలని యోచిస్తున్నారట. వచ్చే వారం దీనిపై వివేక్ రామస్వామి ప్రకటన చేస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.
సానుకూల వాతావరణంలోనే మున్ముందుకు
'డోజ్' విభాగం నుంచి అకస్మాత్తుగా ఎందుకు వైదొలగాల్సి వచ్చింది? ఒహియో గవర్నర్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నాను? అనే అంశాలపై ట్రంప్‌నకు వివరణ ఇచ్చుకునేందుకు వివేక్ రామస్వామి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఎలాన్ మస్క్ గురించి ఫిర్యాదు చేసేందుకు వివేక్ సిద్ధంగా లేరట. గత సోమవారం రోజు(జనవరి 20న) అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు ఎలాన్ మస్క్‌తో తాను కరచాలనం చేసిన ఒక ఫొటోను వివేక్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సానుకూల వాతావరణంలోనే ముందుకు సాగాలనే యోచనతో ఆయన ఉన్నారనేందుకు ఇదే సంకేతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.