Jaishankar On Indian Immigrants In US : సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి అమెరికా వెళ్లిన జైశంకర్ తాజాగా కొంతమంది భారతీయ విలేకరులతో ముచ్చటించారు. ఈ క్రమంలో యూఎస్- భారత్ మధ్య సంబంధాలు, భారత విదేశాంగ విధానం వంటి అంశాలపై ఆయన స్పందించారు.
వారికే మా మద్దతు : జైశంకర్
భారతీయుల ప్రతిభ, నైపుణ్యాలకు ప్రపంచ స్థాయిలో గరిష్ఠ అవకాశాలు దక్కాలని తాము కోరుకుంటున్నామని జైశంకర్ తెలిపారు. అందుకే చట్టబద్ధమైన, న్యాయపరంగా వెళ్లే వలసలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. అదే సమయంలో అక్రమ రవాణా, అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. "ఎందుకంటే ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగినప్పుడు ఇతర నేర కార్యకలాపాలు జరిగే అవకాశం ఎక్కువ. అలాంటి పరిస్థితి సరికాదు. అది దేశానికి మంచి పేరు తీసుకురాదు. అందుకే అమెరికా సహా ఏ దేశానికైనా సరే భారత పౌరులు అక్రమంగా వెళ్లినట్లు నిర్ధరిస్తే వారిని చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు మేం ఎల్లప్పుడూ సిద్ధమే." అని జైశంకర్ వెల్లడించారు.
సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన భారతీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కారు చర్యలు మొదలుపెట్టిందంటూ వస్తోన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అమెరికా పంపించాలనుకుంటున్న భారతీయుల వివరాలను దిల్లీ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎంతమంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమన్నారు.
బంగ్లా పరిస్థితులపై చర్చలు
బంగ్లాదేశ్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై కొత్తగా నియమితులైన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్‌తో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. అమెరికాలోని భారత కాన్సులేట్లపై దాడులు, ఇక్కడ భారత దౌత్యవేత్తలకు ముప్పుపై ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కానీ శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై జరిగిన దాడి చాలా తీవ్రంగా పరిగణించాల్సి విషయమని పేర్కొన్నారు.
ట్రంప్ పాలనపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పాలన నమ్మకంగా, ఉత్సాహంగా కొనసాగుతుందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. భారత్‌తో సంబంధాలపై అమెరికా ఆసక్తిగా ఉందని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు అమెరికా నమ్మకమైన భాగస్వామి. ఆ దేశంతో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది" అని జైశంకర్ తెలిపారు.
పాకిస్థాన్‌తో వాణిజ్యం భారత్ ఆపలేదు : జైశంకర్
పాకిస్థాన్‌తో వాణిజ్యం పునఃప్రారంభంపై చర్చలు జరగలేదని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి చొరవ రాలేదని వెల్లడించారు. పాకిస్థాన్‌తో వాణిజ్యం భారత్ ఆపలేదని, 2019లో పాకిస్థానే ఆ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను భారత్ ఇచ్చినా తిరిగి ఆ దేశం స్టేటస్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు జైశంకర్.