తెలంగాణ

telangana

ETV Bharat / health

మీ 'గుండె' ఎంతో స్పెషల్- జాగ్రత్తగా కాపాడుకోండి - Take Care of Your Heart - TAKE CARE OF YOUR HEART

Take Care of Your Heart : గుండె జబ్బులు చాలావరకు హఠాత్తుగా వచ్చేవేమీ కావంటున్నారు వైద్య నిపుణులు. వీటికి పునాది ఎప్పుడో పడి ఉంటుందని, ముప్పు కారకాలను మార్చుకోవటం ద్వారా 80% వరకు గుండె జబ్బులను నివారించుకోవచ్చు సూచిస్తున్నారు. అయినా కూడా మన నిర్లక్ష్యమే మన గుండెల మీదికి తెస్తోందని చెబుతున్నారు. ఈ రోజు ప్రపంచ హృదయ దినోత్సవం నేపథ్యంలో గుండె జబ్బుకు కారణాలపై స్పెషల్ స్టోరీ.

World Heart Day Special Story
World Heart Day Special Story (Getty Images)

By ETV Bharat Health Team

Published : Sep 29, 2024, 1:57 PM IST

Take Care of Your Heart : ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ అంతా ఉరుకుల పరుగుల జీవితం. దీంతో శరీరం అలసిపోతుంది. అలాగని, అదేం వ్యాయామం కాదు. ఆకలైతే కడుపు నింపుతుంటాం. కానీ, అది ఆరోగ్యకరమైన ఆహారంతో కాదు. నిద్రపోతున్నాం. అయితే అది మనసు తేలికపడేంతలా కాదు. ఫలితంగా... ఒత్తిడి, ప్రతికూల దృక్పథాలు పెరుగుతున్నాయి. వెరసి 30 ఏళ్లు నిండకుండానే అనేక మంది అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్‌ వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. నేడు 'ప్రపంచ హృదయ దినోత్సవం' ఈ నేపథ్యంలో జీవితాన్ని ఆనందంగా గడుపుతూ గుండె జబ్బుల బారిన పడకుండా ఎలా ఉండవచ్చో సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఏవీ ఆంజనేయులు ఈటీవీ భారత్​ పలు విషయాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

12 ఏళ్లపాటు అధ్యయనం
చైనాకు చెందిన పలువురు పరిశోధకులు యూకేలో దీర్ఘకాలంపాటు పరిశోధన చేశారు. 'యూకే బయో బ్యాంక్‌' డేటా నుంచి సుమారు 1,21,317 మందిని తమ పరిశోధన కోసం ఎంచుకున్నారు. 2006 నుంచి 2010 వరకు వీరి ఆరోగ్యానికి చెందిన సమాచారాన్ని తీసుకున్నారు. తర్వాత 2022 వరకు అంటే 12 సంవత్సరాలపాటు వారి జీవితం, కుటుంబం, కెరీర్, శారీరక ఆరోగ్యం, బంధువులు, స్నేహితులు తదితర అంశాల్లో వారు పొందుతున్న ఆనందానికి చెందిన వివరాలు సేకరించారు. వీరిలో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏయే అనారోగ్య సమస్యలు వచ్చాయి? వాటివల్ల ఏర్పడిన నష్టమెంత? వాటిని ఎలా అధిగమించారు తదితర సమాచారానంతటినీ క్రోడీకరించారు. 'ఆరోగ్య జీవనశైలి - హృదయ ఆరోగ్యం' అనే శీర్షికతో పరిశోధకులు రూపొందించిన పరిశోధనపత్రం తాజాగా ప్రఖ్యాత వైద్యపత్రిక 'అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌(అహ-ఏహెచ్‌ఏ)' లో ప్రచురితమైంది.

ఇన్‌ఫ్లమేటరీ మార్కర్ల పాత్ర కీలకం
సంతృప్తి, సంతోషం శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమని పెద్దలు చెబుతున్నారు. మనం చేసే పనిలో, పొందుతున్న ఆదాయంలో, గడుపుతున్న జీవనంలో తృప్తిని పొందలేకపోయినట్లైతే అది శాపంగా మారుతుందని డాక్టర్‌ ఏవీ ఆంజనేయులు అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు పెద్దగా అధ్యయనాలు జరగలేదని తెలిపారు. తాజా అధ్యయనంలో మాత్రం సంతోషాన్ని, సంతృప్తిని ప్రత్యేకంగా విశ్లేషించినట్లు తెలిపారు. అమితమైన సంతోషం, చాలా సంతోషం, ఓ మాదిరిగా సంతోషం.. తీవ్ర దుఃఖం, చాలా బాధ, ఓ మాదిరి బాధ ఇలా వివిధ రకాలుగా విభజించి వారి నుంచి సమాచారం సేకరించారు.

సంతోషానికి, శరీరంలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉంటుందా అనే అంశంపై అధ్యయనం చేశారు. అసంతృప్తి, తీవ్ర బాధలో ఉన్నవారిలో శరీరంలోని ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లుగా పిలిచే సీ-రియాక్టివ్‌ ప్రొటీన్, తెల్ల రక్తకణాలు, లింఫోసైట్స్, సైటోకైన్స్‌ తదితరాలన్నీ పెరిగాయని గుర్తించారు. ఇలాంటి వారిలో గుండెజబ్బుల ముప్పు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఎక్కువ సంతోషంగా ఉన్నవారు, ఆశావహ దృక్పథంతో ఉన్నవారిలో ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లన్నీ తక్కువగా కనిపించాయని పరిశోధనలో తెలింది. తద్వారా వీరికి అన్ని గ్రూపుల కంటే కొలెస్ట్రాల్, హైబీపీ, గుండెజబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

సానుకూలంలో అలవాట్లూ ఆరోగ్యకరమే
సానుకూల దృక్పథంతో జీవిస్తున్న వారిలో అలవాట్లు కూడా ఆరోగ్యకరంగానే ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. బాగా సంతోషంగా ఉన్నవారు తమ కెరీర్, ఆర్థికం,స్నేహితులు, కుటుంబం... ఇలా అన్ని రంగాల్లోనూ సంతోషం, సంతృప్తి వ్యక్తపరిచినట్లు పరిశోధకులు తెలిపారు. సంతోషంగా ఉన్న పురుషులు, మహిళల్లోనూ జీవనశైలి వ్యాధులు తగ్గినట్లు తెలిపారు. కుటుంబ బంధాలు బలంగా ఉన్నవారిలో, స్నేహితులతో భావోద్వేగాలను పంచుకుంటూ నిత్యం ఆహ్లాదంగా గడిపే వారిలో జబ్బులు బాగా తక్కువగా కనిపించాయని తేలింది.

ఔషధం... మాత్రల్లో మాత్రమే ఉండదు
వివిధ వ్యాధులకు ఔషధం మాత్రమే ప్రత్యామ్నాయంకాదనిడాక్టర్‌ ఏవీ ఆంజనేయులు అంటున్నారు. ఔషధం అన్నివేళలా మాత్రల రూపంలోనే లభించదని.. వ్యాయామం, ధ్యానం, ఉపవాసం, నవ్వడం, సరైన నిద్ర, పోషకాహారం, సూర్యరశ్మి, కృతజ్ఞతాభావం, తోటివారిని ప్రేమించడం, ప్రకృతిలో గడపడంతోపాటు ధూమపానం, మద్యపానం ఆపేయడం లాంటి వాటితో చక్కటి అలవాట్లలోనూ ఔషధం ఉంటుందని చెబుతున్నారు.

ఆధ్యాత్మిక ఆరోగ్యమూ కావాలిప్పుడు
శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు కొత్తగా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా సమాజంలో అభివృద్ధి చేయాలని డాక్టర్‌ ఏవీ ఆంజనేయులు చెబుతున్నారు. యోగా, భక్తి, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి ఒత్తిడిని దూరం చేయడానికి దోహదపడతాయని చెబుతున్నారు. ఇవి కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, అనారోగ్యకర అలవాట్లను దూరం చేస్తాయని ఆయన వెల్లడించారు.

మనచుట్టూ వైఫైగా అల్లుకునే ఉంది
ఆనందాన్ని ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదని, అది మన చుట్టూనే ఉంటందని డాక్టర్‌ ఏవీ ఆంజనేయులు చెబుతున్నారు. కాస్త పరికించి చూస్తే అది వైఫై మాదిరి అల్లుకునే ఉండటాన్ని గమనించవచ్చని అంటున్నారు. చేసే ప్రతిపనిలో ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నా, క్షణం తీరిక లేకుండా ఉంటున్నా, కొంత సమయమైనా కుటుంబంతో గడపాలని సూచిస్తున్నారు. మనసుకు నచ్చిన స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. సంతృప్తికర జీవనాన్ని అలవాటు చేసుకోవడం ఎనలేని మేలు చేస్తుందని చెబుతున్నారు.

ఎక్కువ నిద్ర వద్దు తక్కువ నిద్ర మంచిది కాదు
ప్రతి ఒక్కరూ కనీసం 7 నుంచి 9 గంటలపాటు నిద్రపోవాలని డాక్టర్‌ ఏవీ ఆంజనేయులు చెబుతున్నారు. తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడంతో పాటుగా అదే సమయంలో ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. సమస్థితి అత్యంత ముఖ్యమని దానిని పాటిస్తూ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ ఏవీ ఆంజనేయులు సూచనలు చేస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గుండెపోటు నుంచి పాము కాటు వరకు 10 రకాల ప్రథమ చికిత్సల వివరాలు- మీరు తెలుసుకోండి - First Aid Instructions

శారీరక శ్రమ లేకపోతే పిల్లల భవిష్యత్తుకు ప్రమాదమా?- పరిశోధనలు ఏం చెబుతున్నాయి? - Heart Attack Risks In Children

ABOUT THE AUTHOR

...view details