Dinner Eating Mistakes in Telugu: మనం చేసే కొన్ని తప్పుల కారణంగా తెలియకుండానే అధిక బరువు, అనారోగ్యానికి గురవుతున్నామని మీకు తెలుసా? ముఖ్యంగా భోజనాన్ని మానేయడం, ఎక్కువగా తినడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ధీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు రాత్రి పూట భోజనం సమయంలో చేసే తప్పులు వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా రాత్రి వేళ తీసుకునే ఆహారంలో ప్రొటీన్ తక్కువగా ఉంటే.. తొందరగా ఆకలి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా బరువును పెంచే స్నాక్స్ వైపు మనసు మళ్లుతుందని వివరిస్తున్నారు. ఇంకా వైట్ బ్రెడ్, పాస్తా, తెల్ల అన్నం వంటి పిండి పదార్థాలను నిద్రకు ముందు తీసుకోకూడదని వెల్లడిస్తున్నారు. దీని వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరగడంతో పాటు కొవ్వు పేరుకుపోతుందని వివరిస్తున్నారు.
![dinner eating mistakes in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2025/23487337_dinner_eating_mistakes-3.jpg)
రాత్రి సమయంలో వేపుళ్లు తినకూడదని సూచిస్తున్నారు. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయని.. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీనికి బదులుగా రాత్రిళ్లు ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం ఉత్తమమని వెల్లడిస్తున్నారు. ఇంకా రాత్రిళ్లు తినకుండా పడుకోవడం వల్ల మరుసటి రోజు ఆకలితో ఎక్కువగా తినే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి పోషకాలు ఉన్న తేలికపాటి ఆహారం తినడం మంచిదని సలహా ఇస్తున్నారు.
![dinner eating mistakes in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2025/23487337_dinner_eating_mistakes-4.jpg)
మనలో చాలా మంది భోజనం చేసే సమయంలో టీవీ, ఫోన్ చూస్తూ తింటుంటారు. ఇలా టీవీ, ఫోన్లు చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల తెలియకుండానే ఎక్కువ తినేస్తారని నిపుణులు అంటున్నారు. కాబట్టి అవి పక్కన పెట్టి కుటుంబంతో కలిసి భోజనం చేయాలని సలహా ఇస్తున్నారు. 2018లో Appetiteలో ప్రచురితమైన "The effects of eating dinner in front of the television on food intake and meal duration" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కొంతమంది అన్నం, చపాతీలు ఎక్కువ మోతాదులో కూర తక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. కానీ అన్నం అర కప్పు తింటే కప్పు కూర తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. భోజనం చేసేందుకు చిన్న గిన్నెలను, ప్లేట్లను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. అలాగే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారని వివరిస్తున్నారు. సోడా, టీ, చక్కెర ఉన్న పండ్ల రసాల వంటి వాటిల్లో కేలరీలు అధికంగా ఉంటాయని తెలిపారు. రాత్రి వేళల్లో వీటిని తీసుకుంటే బరువు పెరుగుతారని హెచ్చరిస్తున్నారు.
![dinner eating mistakes in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2025/23487337_dinner_eating_mistakes-1.jpg)
![dinner eating mistakes in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2025/23487337_dinner_eating_mistakes-2.jpg)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'బాల భీములు బరువు తగ్గాల్సిందే!- పిల్లల్లో ఊబకాయంతో షుగర్, బీపీ సమస్యలు'
రోజూ రాత్రి రీల్స్ చూస్తున్నారా? పరిశోధనలో కీలక విషయాలు- ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవట!