Childhood Obesity Prevention Strategies: ఆధునిక జీవనశైలి మార్పులతో పెద్దల్లోనే కాదు పిల్లల్లోనూ ఊబకాయం సమస్య పెరుగుతోంది. అయితే, ఈ సమస్య ఎక్కువైనా, నిర్లక్ష్యం చేసినా టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్, రక్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వంటి వాటికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అని చిన్న వయసులోనే మందులు, బేరియాట్రిక్ సర్జరీ వంటి బరువు తగ్గించే ట్రీట్‌మెంట్‌లూ మంచివి కాదని చెబుతున్నారు. వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్‌తో బరువు తగ్గవచ్చేమో కానీ, దాంతో వచ్చిన ఒంటరితనాన్ని ఇష్టపడటం, ఎవరితోనూ కలవకపోవడం, కుంగుబాటు, న్యూనత వంటి మానసిక సమస్యలు తగ్గవని వివరిస్తున్నారు. వీటికి మానసిక వైద్యులతో చికిత్స, కౌన్సెలింగ్ తీసుకోవాలని.. అది ఫలించకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలం ఇబ్బందిపెడతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటో ఇంటర్నల్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దాసరి అనూష వెల్లడిస్తున్నారు తెలుసుకుందాం.
"ఊబకాయానికి కారణాలెన్నో ఉంటాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, పోషకాల అసమతౌల్యత, వేళ తప్పిన తిండి, జన్యుపరమైనవి, థైరాయిడ్, పీసీఓఎస్, జీవక్రియల్లో లోపం, హార్మోన్లు సరిగా పని చేయకపోవడం, జీర్ణాశయ సమస్యలు, పర్యావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం, తినేవాటిపై పురుగు మందుల అవశేషాలు, నిల్వ కారకాల ప్రభావానికి లోనవడం లాంటి కారణాలు ఉంటాయి. ఇవే కాకుండా గర్భంతో ఉన్నప్పుడు తల్లి బరువు, అప్పుడు తనకి మధుమేహం ఉందా? పుట్టినప్పుడు బిడ్డ బరువు వంటివీ కారణాలే. ముఖ్యంగా సరిగా నిద్రలేకపోవడం, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నాయా గమనించాలి. కార్టిసోల్ అధికంగా ఉండటం వల్ల వచ్చే కుషింగ్ సిండ్రోమ్ కూడా ఊబకాయానికి కారణం అవ్వొచ్చు."
--డాక్టర్ దాసరి అనూష, నిపుణులు
ఊబకాయాన్ని వీలైనంత వరకూ జీవనశైలి మార్పులతోనే పరిష్కరించుకోవాలని డాక్టర్ అనూష సూచిస్తున్నారు. అది ఫలించని సమయంలోనే మందులు, శస్త్రచికిత్సల సాయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
మంచి ఆహారం: సమతుల పోషకాహారం, పీచు అధికంగా ఉన్నవి, మంచి ప్రొటీన్లు- ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ చక్కెరలు ఉండే పండ్లు, గింజధాన్యాలు తినాలి. ఇంకా జీర్ణాశయానికి మేలు చేసే ప్రొబయాటిక్.. పెరుగు, మజ్జిగ, పులియ బెట్టిన పదార్థాలు వంటివి బాగా తీసుకోవాలి.
ఇవి వద్దు: ప్రాసెస్డ్, చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, కృత్రిమ చక్కెరలు, ఎనర్జీ డ్రింక్స్, పాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసులు, రిఫైన్డ్ పిండితో చేసేవి, డీప్ ఫ్రైలు, నిల్వ కారకాలు ఉండే వాటి జోలికి వెళ్లవద్దు.
వ్యాయామం: మన పిల్లల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ కనీసం గంట వ్యాయామం.. అదీ తప్పనిసరిగా ఆరుబయట చేయాలని సూచిస్తున్నారు. చిన్న వయసు నుంచి యోగా నేర్పడం మంచిదని.. దాని వల్ల రక్తప్రసరణ, ఫ్లెక్సిబిలిటీ మెరుగు పడతాయని వివరిస్తున్నారు.
నిద్ర: ప్రతిరోజు 8 - 10 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్ర పోవాలి. ఇంకా నిద్రపోయే 2 గంటల ముందే టీవీ, సెల్‌ఫోన్‌లను పక్కన పెట్టాలి. 9.30 కల్లా నిద్రపోయి.. ఉదయం 6కి లేవడం అలవాటు చేయాలి.
మైండ్‌ఫుల్ ఈటింగ్: పిల్లలకు ఆహారం పట్ల అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎలా, ఎప్పుడు తింటున్నాం అన్న విషయాలు చెప్పాలి. ఇంకా తింటున్న ఆహారం పట్ల ఇష్టం, ధ్యాస ఉండాలి. తినకుండానే రుచిని నిర్ణయించకూడదని చెప్పాలి. రుచిని ఆస్వాదించడం, ఆహారం సరిపోయిందా, ఎక్కువవుతోందా వంటివి గమనించుకోవడం నేర్పించాలి. ముఖ్యంగా రాత్రి 7గంటలలోపే భోజనాన్ని ముగించేలా చూసుకోవాలి.
మానసిక ఒత్తిడి: ఊబకాయానికీ- కుంగుబాటుకు దగ్గర సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం ఒక్కటే మానసిక సమస్యల్ని పరిష్కరించదని.. రెండో మెదడుగా పని చేసే జీర్ణాశయం ‘కుంగుబాటు’ విషయంలో కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. అందువల్ల జీర్ణాశయ ఆరోగ్యం, పోషకాల సమతుల్యత, భావోద్వేగాల నియంత్రణ, హార్మోన్ల పనితీరు వంటివి బరువును, మూడ్‌ను అదుపులో ఉంచేందుకు చాలా అవసరమని వివరిస్తున్నారు.
అనుబంధాలు: ఊబకాయంతో బాధపడే పిల్లలో చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. వారి ఆలోచనలు, భయాలు, ఆందోళన వంటివి అమ్మానాన్నలు, తోబుట్టువులతో నిస్సంకోచంగా చర్చించే వాతావరణాన్ని కల్పించి.. ధైర్యాన్నీ పెంచాలని సూచిస్తున్నారు.
ఇవన్నీ పనిచేయని సమయంలో మాత్రమే మందులు, బేరియాట్రిక్ శస్త్ర చికిత్సలను తీసుకోవాలని డాక్టర్ దాసరి అనూష చెబుతున్నారు. శస్త్రచికిత్స, లేదా మందులతో సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అప్పుడు కూడా బరువును దీర్ఘకాలం అదుపులో ఉంచుకోవాలంటే మైండ్‌ఫుల్ ఈటింగ్, వ్యాయామం, బరువు పెరగడానికి కారణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజూ రాత్రి రీల్స్ చూస్తున్నారా? పరిశోధనలో కీలక విషయాలు- ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవట!
రోజూ స్నానం చేయడం మంచిది కాదా? ఎన్ని రోజులకోసారి చేయాలి? నిపుణులు ఏం అంటున్నారంటే?