School Girl Rape Case : పాఠశాల విద్యార్థినిపై ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిపై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు పోలీసులు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని జరిగిందీ సభ్యసమాజం తల దించుకునేలా జరిగిందీ ఘటన.
పోలీసుల వివరాల ప్రకారం, కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. విద్యార్థిని నెల రోజులుగా స్కూల్కు వెళ్లలేదు. ప్రధానోపాధ్యాయుడు, సహచర విద్యార్థినులు ఆరాతీయగా సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల బాలిక ఇంటికి వెళ్లి తల్లిని అడిగారు. తన కుమార్తె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకెళుతున్నట్లు ఆమె చెప్పడం వల్ల అంతా షాకైపోయారు.
ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు జిల్లా బాలల భద్రతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బాలికను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు చేయించారు. అనంతరం బర్గూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బర్గూర్ డీఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైన పారూరైకు చెందిన చిన్నసామి(57), మత్తూర్‌కు చెందిన ఆరుముగం(45), మేలపట్టికి చెందిన ప్రకాశ్(37)ను మంగళవారం అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో బాలికల భద్రతను నిర్ధారించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిచారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బాధ్యత వహించాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. ఆ తర్వాత బాధితురాలికి కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సి దినేశ్ కుమార్ తెలిపారు.